అక్రమాస్తులను ప్రభుత్వపరం చేసేందుకు: ఏసీబీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డ అవినీతి అధికారుల అక్రమాస్తులను ప్రభుత్వపరం చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రత్యేక న్యాయస్థానాల చట్టం పరిధిలో విచారణ కోసం ఏయే కేసులను ఎంపిక చేయాలనేదానిపైనా కసరత్తు పూర్తి చేసింది. గత కొన్ని రోజులుగా ఏసీబీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ అధికారులతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు.
2016 మే 20 నుంచి ప్రత్యేక న్యాయస్థానాల చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏసీబీ నమోదు చేసిన కేసులలో తీవ్రత అధికంగా ఉన్న వాటిలో పది కేసులను ఎంపిక చేశారు. ఆయా కేసుల వివరాలను ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి పంపించనున్నారు. పురపాలక శాఖ ప్రజారోగ్య విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పాము పాండురంగారావు, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు, రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.గంగాధరం, ఏపీఈడబ్ల్యూఐడీసీ బీ.జగదీశ్వర్‌రెడ్డి, సబ్‌ రిజిస్ట్రార్‌ దొడ్డపనేని వెంకయ్యనాయుడు, డీఎస్పీలు హరనాథ్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌ తదితర అధికారులకు సంబంధించిన కేసుల వివరాలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

నోటీసుతో ప్రక్రియ మొదలు
అక్రమాస్తులు కూడబెట్టారని చెప్పేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నందున సంబంధిత కేసులను ప్రత్యేక న్యాయస్థానాల చట్టం పరిధిలో విచారిస్తామని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసు జారీ చేస్తారు. అనంతరం అక్రమాస్తుల స్వాధీనం కోసం అధీకృత అధికారిని నియమిస్తారు. ఆయన నిపుణుల సాయంతో అక్రమాస్తుల విలువను లెక్కిస్తారు. ఆయనపై వచ్చిన అభియోగాలను పేర్కొంటూ వివరణ కోరతారు. నిందితుడైన అధికారి తనది సక్రమార్జనేనని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను నిర్దేశిత గడువులోగా అధీకృత అధికారికి సమర్పించాలి. దానిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కౌంటర్‌ దాఖలు చేస్తారు. వీటి పరిశీలన, వాదనల పూర్తి అనంతరం ఆరు నెలల్లోగా న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును వెల్లడిస్తుంది. తీర్పుననుసరించి చర్యలు తీసుకుంటారు.

అక్రమాస్తులను అనుభవించేందుకు కుదరదు
2016 నుంచి ఇప్పటివరకూ ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ 101 కేసులు నమోదు చేసింది. వాటిల్లో గుర్తించిన అక్రమాస్తుల మార్కెట్‌ విలువ దాదాపు రూ.2,500 కోట్లు ఉంటుందని అంచనా. అందులో అధిక శాతం స్థిరాస్తులు, బంగారు, వజ్రాభరణాల రూపంలో ఉన్నవే. కేసు దర్యాప్తులో ఉన్నందున స్థిరాస్తులపై వచ్చే ఆదాయాన్ని నిందితులైన అధికారులే అనుభవిస్తున్నారు. అయితే, ఇకపై ఆ అవకాశం ఉండదు. ప్రత్యేక న్యాయస్థానాల చట్టం పరిధిలో విచారించే కేసుల్లోని ఆస్తులన్నీ ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లిపోతాయి. కేసు తుది విచారణ పూర్తయ్యేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రజోపయోగ పనులకు వినియోగించుకోవచ్చు. కేసు కొట్టేస్తే ఆ ఆస్తులను సంబంధిత అధికారికి అప్పగిస్తారు. లేకపోతే పూర్తిగా ప్రభుత్వపరమైపోతాయి.