అతియా శెట్టి కి మద్దతుగా అభిషేక్ బచ్చన్

ముంబై: సెలబ్రిటీలు ఎలా ఉన్నా, ఏం చేసినా వారికి వ్యతిరేఖంగా కొందరు నెటిజన్లు కామెంట్లు చేయడం చూస్తుంటాం. తాజాగా స్టార్ హీరో కూతురికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఈ విషయంలో ఆమెకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ మద్దతుగా నిలిచారు. సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, ఇలియానా, ఐశ్వర్యరాయ్ బచ్చన్ సహా పలువురు హీరోయిన్లు బాడీ షేమింగ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటివి చేయవద్దని పిలుపునిచ్చారు.

అయితే తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు, నటి అతియా శెట్టి లావుగా ఉందని, కాస్త తిండి తగ్గించాలంటూ కొందరు కామెంట్లు చేశారు. ఆమె ఎక్కువ తింటేనే బాగా కనిపిస్తారని మరికొందరు ట్వీట్లు చేశారు. దీనిపై అతియా స్పందిస్తూ.. ‘కొందరు సన్నగా ఉండొచ్చు. లేక లావుగా ఉంటారు. ఎక్కువ తినాలో.. లేక తిండి తగ్గించాలో చెప్పడం చెడ్డ అలవాటు. ఎవరి పోరాటం వారిది. బాడీ షేమింగ్ కామెంట్లు మానేయడం మంచిది. ఇతరులపై కాస్త దయగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు.

నటి అతియా వ్యాఖ్యలకు అభిషేక్ మద్దతుగా నిలిచారు. ఇలాంటి విషయాలు ఏ మాత్రం పట్టించుకోవద్దు. వెళ్లి ఓ డోనట్ తిను’ అంటూ రీట్వీట్ చేయగా వైరల్ అవుతోంది. అతియా, అభిషేక్ ట్వీట్లకు విశేష స్పందన లభిస్తోంది. ఇతరుల శరీరతత్వాన్ని అంగీకరించాలే తప్ప.. విమర్శించడం మంచి పద్ధతి కాదని లేనిపోని కామెంట్లు చేసేవారికి కొందరు నెటిజన్లు హితవు పలుకుతున్నారు.