అదిరిపోయే లుక్‌లో రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్ , మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే..’. త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేసారు ఈ సినిమా నిర్మాత‌లు . రామ్ పుట్టినరోజును పురష్కరించుకుని హ్యాపీ బర్త్‌డే పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఎన‌ర్జిటిక్ రామ్‌ని స‌రికొత్త కోణంలో చూపే చిత్రం ‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. జూన్ ఫ‌స్ట్ వీక్‌లో కాకినాడ‌, ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జ‌రుపుతాం. దీని తర్వాత హైద‌రాబాద్‌లో కొంత పార్ట్ షూటింగ్‌ చేస్తాం. దీంతో చిత్రీక‌ర‌ణ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాం. ‘సినిమా చూపిస్త మావ‌’, ‘నేను లోక‌ల్’ వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. అవుట్‌పుట్ చాలా బాగా వ‌స్తోంది. త‌ప్పకుండా ప్రేక్షకుల‌ను అల‌రించేలా ఈ చిత్రం ఉంటుందని మూవి యునిట్ ’ అన్నారు. కిందటేడాది వచ్చిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలో డిఫరెంట్ లుక్‌తో కనిపించిన రామ్.. ఈ సినిమాలో క్లాసీ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు . అనుపమ పరమేశ్వరన్‌ను ఫాలో అవుతున్నట్టు ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ చాలా అందంగా ఉంది. ఇప్పటికే ఈ జంట ‘ఉన్నది ఒక్కటే జిందగీ’లో కనిపించింది. ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.