అనుకున్నది ఒకటి జరిగేంది ఇంకొకటి : కోహ్లీ

ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక మొత్తంలో ఆదాయాన్ని గడిస్తున్న క్రికెటర్‌గా ఇప్పటికే విరాట్‌ కోహ్లీకి పేరుంది. ఐపీఎల్‌లోనూ రూ.17 కోట్లతో అతడే టాప్‌లో ఉంటాడు. కానీ కౌంటీల్లో సర్రే తరఫున ఆడనున్నందుకు కూడా ఇదే స్థాయిలో సంపాదన ఉంటుందనుకుంటే పొరపాటే.. అక్కడ ఆడబోతున్నందుకు కోహ్లీకి దక్కేది స్వల్పమేనని సమాచారం. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు కోహ్లీ కౌంటీల్లో ఆడనున్న విషయం తెలిసిందే. ఇక్కడ డబ్బుకు కోహ్లీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ‘అందరూ అనుకుంటున్నట్టు సర్రే నుంచి కోహ్లీకి భారీ మొత్తమేమీ దక్కడం లేదు. నెల రోజుల పాటు అక్కడ ఆడుతున్నందుకు కోహ్లీకి విమాన ఖర్చులు, వసతితో పాటు సాధారణ మ్యాచ్‌ ఫీజు మాత్రమే అందుతుంది. అది ఎంత అని చెప్పే స్వేచ్ఛ మాకు లేదు. ఇంగ్లండ్‌ పరిస్థితులకు కోహ్లీ అలవాటు పడడమే ముఖ్యం కానీ ఇందులో ఆదాయం గురించి ఆలోచన లేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే సర్రే.. కోహ్లీ ఇమేజీని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నా, భారత కెప్టెన్‌ మాత్రం అక్కడ ఆడే ఆరు మ్యాచ్‌లపైనే దృష్టి పెట్టాడట. కౌంటీ మ్యాచ్‌ల కోసం కోహ్లీ జూన్‌లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు దూరం కానున్నాడు.