అమరావతిలో పిడుగుల వర్షం

అమరావతి: కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు.. ఢమ ఢమా.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోత.. నడినెత్తిపై పడుతుందేమో అనేంతగా వణుకు.. అడుగుల దూరంలోనే పడిందేమో అన్పించేలా భయం…ఇదీ మంగళవారం పిడుగులు పుట్టించిన బీభత్సం. ఇలా రాత్రి 8.30 గంటల దాకా(మొత్తం 13.30 గంటల సమయంలో) ఒకటా.. రెండా.. ఏకంగా 36,749 పిడుగులు నేలను తాకాయి. గుంటూరు, కృష్ణా మినహా మిగిలిన 11 జిల్లాల్లో 369 మండలాల ప్రజల్ని కలవరపరిచాయి. మూడు జిల్లాల్లో ఏడుగురిని బలిగొన్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా ఇంత సుదీర్ఘ సమయం పిడుగుల వర్షం కురవడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. సాధారణంగా ఒక్కో పిడుగు సగటున 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. వాతావరణాన్ని బట్టి 360 డిగ్రీల కోణంలో ఎటైనా దిశ మార్చుకుంటుంది.
* ఈ ఏడాది మార్చి 16 నుంచి 15 రోజుల వ్యవధిలో 10,436 పిడుగులు పడ్డాయి. మంగళవారం

ఒక్కరోజే దీనికి రెండున్నరరెట్లు పైగా.. 36,749 చోట్ల నమోదయ్యాయి. దీనికి కారణాలేమిటనే అంశంపై అధికారులు దృష్టి సారించారు.
* గతేడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు దాకా రాష్ట్రవ్యాప్తంగా 2.62లక్షల పిడుగులు పడినట్లు విపత్తు నిర్వహణ సంస్థ గుర్తించింది. విశాఖపట్నంలో అత్యధికంగా 35,320, నెల్లూరులో 33,131, ప్రకాశం 27,231, తూర్పుగోదావరి 25,153, విజయనగరం 22,602, చిత్తూరు 20,255, నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 9,057, శ్రీకాకుళం 9,301 గుర్తించారు.
* ఇవన్నీ నదులు, చెరువులు, వాగులు, చెట్లు, అడవులు, మైదానప్రాంతాల్లో నేలను తాకాయి.
* 2017లో ఏప్రిల్‌ నుంచి అక్టోబరు దాకా రాష్ట్రంలో 61 మంది పిడుగుల కారణంగా చనిపోయారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు పిడుగుపడి 33 మంది, చెట్లకింద నిలబడి 15, ఇంటిసమీపంలో, షెడ్లకింద ఉండి 13 మందిచనిపోయినట్లు అధికారులు గుర్తించారు.
* 2018లో ఇప్పటిదాకా పిడుగుపాటుకు 22మంది చనిపోయారు. ఇందులో 14మంది పురుషులు, ఏడుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

ఒక్కరోజే 8.8లక్షల మందికి: అకాలవర్షాలు.. ఉరుములు, మెరుపులు.. పిడుగులు.. ప్రభావంతో ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం పెరుగుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వీటి తీవ్రత అధికంగా ఉంది. దీంతో 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించి ముందే హెచ్చరించే వ్యవస్థను విపత్తు నిర్వహణ శాఖ గతేడాది ప్రారంభించింది. ఈ క్రమంలోనే పిడుగుపాటు కారణంగా ప్రాణనష్టాన్ని నివారించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో సందేశాలు పంపిస్తోంది. పిడుగు పడే ప్రాంతాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌టవర్ల పరిధిలో ఉన్న వినియోగదారులందరినీ ఏకకాలంలో అప్రమత్తం చేస్తుంది. మంగళవారం ఇలా 369 మండలాల్లో 8.8లక్ష మంది మొబైల్‌ ఫోన్లకు రెండేసి సందేశాల చొప్పున పంపింది.

విస్తృత ప్రచారం..: పిడుగుపాటు ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆల్‌ ఇండియా రేడియో, ఎఫ్‌ఎం రేడియోల ద్వారా కూడా పిడుగులు పడబోయే ప్రాంతంపై ముందస్తు సూచనలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసారమాధ్యమాలు, కళాశాలలు, పాఠశాలలు, గ్రామాల వారీగా అంగన్‌వాడీలు, పొదుపు సంఘాలతో అవగాహన సదస్సులు, కరపత్రాలు, సినిమాహాళ్ల ద్వారా ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. హెచ్చరికలు అందిన వెంటనే పొలంలో పనిచేసే సురక్షితప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.