అమృతకు వ్యవసాయభూమి, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు

ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృతవర్షిణిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అమృతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. అమృత భద్రత కోసం పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అమృతకు ప్రభుత్వం తరఫున రూ. ఎనిమిది లక్షల 25 వేలు సాయం అందిస్తామని వెల్లడించారు. అలాగే సాగుకు అనువైన వ్యవసాయ భూమిని, డబుల్ బెడ్ రూం ఇల్లుని ఇస్తామని జగదీశ్‌రెడ్డి తెలిపారు.

ప్రణయ్‌ అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఇది కులాంతర వివాహం కావడం, ప్రణయ్‌ దళితుడు కావడంతో అమృత తండ్రి మారుతీరావు అంత్యంత కిరాతకంగా ప్రణయ్‌ను పట్టపగలు నడిరోడ్డుమీద చంపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన అనంతరం ప్రేమవివాహం చేసుకున్న జంటలపై జరుగుతున్న దారుణాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతీరెడ్డి పరామర్శించారు. ప్రణయ్‌ కుటుంబానికి, అమృతకు అండగా ఉంటామని ఆమె తెలిపారు.