అశ్రునయనాలతో కరుణానిధి అంతిమయాత్ర

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి అంతిమయాత్ర రాజాజీ హాల్‌ నుంచి ప్రారంభమైంది. తమ ప్రియతమ నాయకుడిని చివరిసారిగా చూసేందుకు దారి పొడువున డీఎంకే కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు. తమ అభిమాన నేతకు నాయకులు, అభిమానులు, ప్రజలు కన్నీటితో నివాళులర్పిస్తున్నారు. మెరీనా బీచ్‌ రోడ్డు ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం మీదుగా అంతిమయాత్ర సాగనుంది.

మరికాసేపట్లో మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియల కోసం మెరీనా బీచ్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.