ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు

 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు ఎదురు చూస్తున్న 11వ వేతన సవరణ సంఘానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల రాష్ట్రంలోని 4.3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. వేతన సంఘం బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించింది. అమరావతిలోని సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
* ఉద్యోగుల జీతభత్యాల సవరణకు ఐదేళ్లకోసారి పీఆర్‌సీ ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 28న పదో వేతన సంఘం ఏర్పాటైంది. 2014 మే 29న అది నివేదిక ఇచ్చింది. 29శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సంఘం సిఫార్సు చేయగా ప్రభుత్వం 43శాతం ప్రకటించింది.
* ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బంది, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితులను కొత్తగా ఏర్పాటయ్యే వేతన సవరణ సంఘం అధ్యయనం చేస్తుంది. వారికి ఏ మేరకు జీత భత్యాలను అందించాలనే విషయమై సిఫార్సులు చేస్తుంది.
* పీఆర్‌సీ పాత బకాయిలైన రూ.3,999 కోట్లను విడతల వారీగా చెల్లించనున్నారు. ఎన్ని విడతలనేది ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయిస్తారు. పెన్షనర్లకు నగదు రూపంలో, ఉద్యోగులకు జీపీఎఫ్‌ రూపంలో చెల్లింపులు చేస్తారు. ఇందులో ప్రస్తుతం ఒక వాయిదా చెల్లించనున్నారు.
* కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌పై (సీపీఎస్‌) వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

బదిలీలపై…
ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరస్పర అంగీకారం (మ్యూచ్‌వల్‌ గ్రౌండ్స్‌), విజ్ఞప్తులకు (ఆన్‌ రిక్వెస్ట్‌) వీటిని పరిమితం చేసింది. ఈనెల 5 నుంచి వచ్చే నెల 4 మధ్య బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వశాఖలను ఆర్థికశాఖ ఆదేశించింది. సాధారణ బదిలీల (జనరల్‌ ట్రాన్స్‌ఫర్‌) విషయాన్ని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. ఒకేచోట మూడేళ్లుగా పని చేస్తూ ఆరోగ్య సమస్యలు, వికలాంగులు, వితంతువుల వంటి కేసులకు, భార్యాభర్తల విషయంలో కనీసం 8 ఏళ్ల బదిలీ కాల వ్యత్యాసం ఉండే వారికి బదిలీలు వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఆదాయ సమీకరణ ప్రభుత్వశాఖలైన వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణాతోపాటు వైద్య ఆరోగ్య, వ్యవసాయ, విద్యాశాఖలో బోధనేతర, సంక్షేమశాఖల ఉద్యోగులు బదిలీల పరిధిలోకి వస్తారని ప్రభుత్వం వెల్లడించింది. విద్య, సంక్షేమశాఖల ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో సేవలు అందిస్తున్న బోధన సిబ్బందికి బదిలీలు వర్తించని ఆర్థికశాఖ స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగుల విజ్ఞప్తులపై చేసే బదిలీలకు టీఏ/డీఏ ప్రభుత్వం చెల్లించదని ఈ ఉత్తర్వుల్లో వివరించారు.