ఆగ‌స్ట్ నెలలో 5రోజులు శ్రీ‌వారి ఆల‌యం మూసివేత‌

పుష్కరానికి ఓమారు జరిగే అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు నెలల 5 రోజుల పాటు తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనం పూర్తిగా రద్దు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతి 12 సంవత్సరాలకూ ఓసారి మహా సంప్రోక్షణ జరుగుతుండగా, చివరిగా 2006లో ఈ క్రతువు జరిగింది. ఇందులో భాగంగా వైఖానస ఆగమ నిబంధనల మేరకు గర్భాలయం, ఆనందనిలయం చుట్టూ పలు కార్యక్రమాలు జరుగుతాయి. గర్భగుడిలో మరమ్మతులను స్వయంగా అర్చకులే చేస్తారు. ఇప్పటికే ఆ ఐదు రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, ఆర్జిత సేవా టికెట్లనూ టీటీడీ జారీ చేయలేదు. స్వామి దర్శనం పూర్తిగా నిలిపివేయాలన్న విషయమై తుది నిర్ణయాన్ని 24వ తేదీన జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.