ఆనం వివేకా కుటుంబ సభ్యులకు వెంకయ్య సానుభూతి

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు తీరని లోటని వెంకయ్య అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ్యునిగా, విద్యావేత్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎల్లప్పుడూ చురుకుగా, చమత్కారాలతో ఆయన మాట్లాడే మాటలు ఇప్పటికీ గుర్తుకువస్తున్నాయన్నారు. ఆనం వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన మరణాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.

గత కొన్నిరోజులుగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆనం వివేకానందరెడ్డి హైదరాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి నెల్లూరులో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.