ఆరేడు నెలల్లో 75వేల ఉద్యోగాలు ..రిలయన్స్‌ జియోలో

హైదరాబాద్‌: రిలయన్స్‌ జియోలో రానున్న ఆరేడు నెలల్లో సుమారు 75 వేల మంది ఉద్యోగులను తీసుకోబోతున్నట్లు సంస్థ సీహెచ్‌ఆర్‌ఓ సంజయ్‌ జోగ్‌ తెలిపారు. సంస్థ విస్తరణలో భాగంగా బ్రాడ్‌బ్యాండ్‌, పేమెంట్స్‌ బ్యాంకింగ్‌, కృత్రిమ మేధ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని ఆయన చెప్పారు. సాంకేతికత, డిగ్రీ విద్యార్థులకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా టెక్‌ 18 సదస్సులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెలికాం సంస్థలు విలీనమైనా.. మూతపడ్డా అందులోని ఉద్యోగులకు ఇబ్బందేమీ ఉండదని, వారికి ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయన్నారు. సాంకేతిక విభాగంలో పనిచేసే వారు ఐటీ కంపెనీల్లోనూ.. మార్కెటింగ్‌ విభాగంలోని వారికి ఇతర కంపెనీల్లోనూ ఉద్యోగాలు ఉంటాయని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ రంగంలో ఉన్నవారికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ కూడా ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. భారత్‌లో ఉద్యోగులు దొరకడం తేలికేగానీ.. సరైన నైపుణ్యాలు ఉన్నవారు దొరకడమే కష్టంగా ఉందన్నారు. ఉద్యోగాన్వేషణలో యువత పట్టణ ప్రాంతాలకు తరలి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందన్నారు. జియోలో గత రెండేళ్లలో 1,57,000 మంది ఉద్యోగులను తీసుకున్నామనీ.. పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా తీసుకోబోయే వారిలో చాలామటుకు ఫ్రెషర్లు ఉంటారనీ.. దీనికోసం దేశవ్యాప్తంగా కళాశాలల నుంచి విద్యార్థులను ప్రాంగణ నియామకాలు చేసేందుకు చూస్తున్నామని తెలిపారు. తమ ఉద్యోగుల సిఫార్సుల ఆధారంగా కూడా దాదాపు 15శాతం వరకూ తీసుకుంటున్నామన్నారు. తమ సంస్థలో ప్రాథమిక ఉద్యోగాల్లో నిష్క్రమణ శాతం 32శాతం వరకూ ఉందనీ.. హెడ్‌ క్వార్టర్‌లో 2 శాతం వరకూ ఉందన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి జియో ఒక ఆధారంగా కనిపిస్తోందని.. ఆ తర్వాత వారి వారి భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్తున్నారని, ఇది మంచి పరిణామమేనని పేర్కొన్నారు. టెలికాం రంగంలో మొత్తంగా చూస్తే ఇది 22శాతం వరకూ ఉందన్నారు.