ఆర్థిక ఇబ్బందులు : ఉద్యోగులపై వేటు

దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ విమాన యాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి సిబ్బంది వేతనాలను 25 శాతం తగ్గించాలని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. అయితే వేతనాలు తగ్గించుకోవడానికి పైలెట్లు ససేమీరా అనడంతో ఇక ఏం చేయాలేక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జీతాల కోతను పక్కకు పెట్టిన జెట్‌ ఎయిర్‌వేస్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గ్రౌండ్‌ స్టాఫ్‌లో 500 మందిపై వేటు వేయాలని ఈ ఎయిర్‌లైన్స్‌ నిర్ణయించిందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌లో 16,558 మంది ఉద్యోగులున్నారు. వారిలో సుమారు 5వేల మంది గ్రౌండ్‌ స్టాఫ్‌. అయితే వీరిలో 500 మందికి పింక్‌ స్లిప్‌లు ఇ‍వ్వాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీరి వేతనాలు రూ.10 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉండనున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి.

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడంతో, జెట్ ఎయిర్‌వేస్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులు 25 శాతం వేతనాలు తగ్గించుకోవాలని మేనేజ్‌మెంట్‌ ఆదేశించింది. ఈ వేతన కోత ప్రతిపాదనకు వ్యతిరేకంగా పైలెట్లు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనకు దిగొచ్చిన జెట్‌ ఎయిర్‌వేస్‌ మేనేజ్‌మెంట్‌, ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఉద్యోగుల వేతనాల కోతను చేపట్టడం లేదని చైర్మన్‌ నరేష్‌ గోయల్‌ భరోసా ఇచ్చారు. వేతనాల కోత నిర్ణయంపై వెనక్కి తగ్గిన జెట్‌ ఎయిర్‌వేస్‌, ఉద్యోగులపై వేటు వేస్తోంది.