ఆర్థిక, సామాజిక అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు

 

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో స్థలాలు కేటాయించినా ఇప్పటికీ పనులు ప్రారంభించని సంస్థలకు తాఖీదులు జారీ చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం అనంతరం నారాయణ విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు 65 సంస్థలకు 1312 ఎకరాలు కేటాయించామని, వీటిలో విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థల్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అన్నారు. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృతకు వంద ఎకరాల చొప్పున లోగడ కేటాయించామని, మరో వంద ఎకరాలు రిజర్వులో ఉంచుతున్నామని చెప్పారు. ఇండో-యూకే విశ్వవిద్యాలయానికి 150 ఎకరాలు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌కు 50 ఎకరాలు, బీఎస్‌ఆర్‌ శెట్టి ఆఫ్‌ మెడికల్‌ పరిశోధన కేంద్రానికి 150 ఎకరాలు, మరికొన్ని చిన్న సంస్థలకు భూములు కేటాయించామని తెలిపారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న సంస్థలకు మాత్రమే సీఆర్‌డీఏ పరిధిలో భూములు కేటాయిస్తున్నామని తెలిపారు.
మరో 13 సంస్థలకు 54.33 ఎకరాలు..
రాజధాని ప్రాంతంలో మరో 13 సంస్థలకు 54.33 ఎకరాల భూములు కేటాయించాలని నిర్ణయించి మంత్రిమండలి ఆమోదానికి పంపుతున్నామని మంత్రి చెప్పారు. ఏయే సంస్థలకు ఎంతెంత భూములను కేటాయించేందుకు సిఫారసు చేస్తున్నారో వివరించారు.

పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల మరమ్మతుకు రూ.10 వేల సాయం
గ్రామీణ తరహాలో పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వసాయంతో పేదలు నిర్మించుకుని, ప్రస్తుతం పాడైన ఇళ్ల మరమ్మతుకు రూ.10వేల చొప్పున సాయం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించి ముఖ్యమంత్రి ఆమోదానికి ప్రతిపాదనలు పంపుతోందని మంత్రి నారాయణ తెలిపారు. 2006కు ముందు ప్రభుత్వ సాయంతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఇదివరకే ఇళ్లు కేటాయించాక మరోసారి మంజూరు చేసే అవకాశం లేనందున మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చించి నిబంధనలు సడలించేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పేదలకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, గృహకల్ప కింద చేపట్టిన గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి రూ.25 వేల నుంచి రూ.50 వేలు పెంచాలని నిర్ణయించామన్నారు. కుప్పం మాదిరి మిగిలిన ప్రాంతాల్లో జీ+3 తరహాలో పేదలకు ఇళ్ల నిర్మాణ ప్రతిపాదనలు పరిశీలించాలని ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేస్తుందని చెప్పారు.