ఆళ్లగడ్డ టిక్కెట్ వారికే అన్న‌:చంద్రబాబు

‘ఆళ్లగడ్డ పంచాయతీ’ ముగిసింది. కర్నూలు జిల్లాలో మంత్రి భూమా అఖిలప్రియ, పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో… వాటిని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే సహించబోనని, కలసి పనిచేయాలని ఇద్దరికీ స్పష్టంచేశారు. తాను ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నానని, ఎవరికి గెలుపు అవకాశాలుంటే వారికే టిక్కెట్‌ ఇస్తానని, అప్పటి వరకు గొడవలు పడకుండా ఐకమత్యంగా పనిచేయాలని స్పష్టంచేశారు. శుక్రవారం ఉండవల్లిలో ఈ సమావేశం జరిగింది. భూమా కుటుంబ సభ్యులతోను, సుబ్బారెడ్డితోను మొదట ఆయన విడివిడిగా… అనంతరం అఖిలప్రియను, సుబ్బారెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడారు. తనపై అఖిలప్రియే రాళ్లదాడి చేయించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కోరారు. ఇద్దరి వాదనలూ విన్న ముఖ్యమంత్రి, వారికి నచ్చజెప్పారు. సీనియర్లకు గౌరవం ఇవ్వాలని, వారితో కలసి పనిచేయాలని అఖిలప్రియకు సూచించారు. అఖిలప్రియ మీకు కుమార్తె వంటిదని, తల్లిదండ్రులులేని పిల్లలు కాబట్టి వారికి అండగా ఉండాలని సుబ్బారెడ్డికి చెప్పారు. భూమా కుటుంబానికి, సుబ్బారెడ్డికి మధ్య ఆర్థికపరమైన సమస్యలేమైనా ఉంటే ఇద్దరికీ ఆమోదయోగ్యుడైన రామకృష్ణారెడ్డిని మధ్యవర్తిగా పెట్టుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. తనకు ప్రొటోకాల్‌ ఉండేలా నామినేటెడ్‌ పదవి ఏదైనా ఇవ్వాలని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం వర్ల రామయ్యతో కలసి, అఖిలప్రియ, సుబ్బారెడ్డి, బ్రహ్మానందరెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ‘‘పార్టీ కోసం, చంద్రబాబు నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా పనిచేస్తామని అఖిలప్రియ, సుబ్బారెడ్డిలు ముఖ్యమంత్రికి చెప్పారు. వివాదం టీ కప్పులో తుపానులా ముగిసిపోయింది’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
కుమార్తెలా భావించి సలహాలిచ్చారు: అఖిలప్రియ
ముఖ్యమంత్రి తనను కుమార్తెలా భావించి సలహాలిచ్చారని అఖిలప్రియ తెలిపారు. ఆయన ఆదేశాల్ని జవదాటబోమన్నారు. సుబ్బారెడ్డి గతంలో భూమా నాగిరెడ్డితో కలసి పనిచేయడాన్ని సీఎం గుర్తు చేశారన్నారు. ఇప్పుడు ఆయనతో కలసి పనిచేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తనకు చెప్పారన్నారు. ఐకమత్యంగా పనిచేస్తామని నేను, బ్రహ్మానందరెడ్డి, సుబ్బారెడ్డి ముఖ్యమంత్రికి చెప్పామని తెలిపారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ…అధిష్ఠానానిదే తుది నిర్ణయమని మొదటి నుంచీ చెబుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్టు వివాదాలు పక్కన పెట్టి కచ్చితంగా పార్టీ అభివృద్ధి కోసం కలసి పనిచేస్తానని పేర్కొన్నారు.