ఆళ్లగడ్డ రాజకీయాల్లో ఉత్కంఠం…పోలీసుల అప్రమత్తత

 

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పార్టీ పిలుపు మేరకు మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి పోటాపోటీగా సైకిల్ యాత్రలు చేపట్టారు. రుద్రవరం మండలం ముత్తలూరు, నర్సాపురంలో అఖిలప్రియ, ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌యాత్ర చేపట్టారు. అధికార పార్టీ నేతలు మధ్య కోల్డ్‌వార్ నెలకొన్న క్రమంలో పోటాపోటీగా సైకిల్ యాత్ర నిర్వహించడం ఆళ్లగడ్డ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

నిన్న తన అనుచరులతో కలిసి ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేపట్టగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలు విసిరారు. ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఏవీ ఫిర్యాదు చేయడంతో 12మందిపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా మరోసారి దాడులు జరిగితే మాటల్లో కాదు..చేతల్లో చూపిస్తామని ఏవీ సుబ్బారెడ్డి హెచ్చరికల జారీ చేసిన క్రమంలో ఇవాళ పోటాపోటీగా జరుగుతున్న సైకిల యాత్రపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసుల మోహరించారు.