ఇండియా కచ్చితంగా గెలుస్తుంది

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ నేడు జరగనున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫీవర్‌ తారాస్థాయికి చేరింది. ఇరు జట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. సెలబ్రిటీలు కూడా సెమీస్‌ మానియాతో ఊగిపోతున్నారు. 16 సార్లు డబ్ల్యూ డబ్ల్యూఈ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన అమెరికాకు చెందిన ప్రముఖ మల్లయోధుడు జాన్‌ సెనా మొదటిసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెట్‌ ఫొటో షేర్‌ చేశాడంటే క్రికెట్‌ మానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి షేక్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్న ఈ ఫొటోలో రోహిత్‌ శర్మ, రవిశాస్త్రి, కుల్దీప్‌ యాదవ్‌ కూడా ఉన్నారు.

కోహ్లి సేనకు జాన్‌ సెనా మద్దతు తెలుపుతున్నాడని ఈ ఫొటో ద్వారా వెల్లడైందని భారత్‌ అభిమానులు టీమిండియా అభిమానులు మురిసిపోతున్నారు. ఒక దిగ్గజ ఆటగాడు మరో లెజెండరీ ఆటగాడికి శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ‘అవును.. జాన్‌ సెనా ఇండియా కచ్చితంగా గెలుస్తుంద’ని మరొకరు కామెంట్‌ చేశారు. జాన్‌ సెనాను చూసి రోహిత్‌ శర్మ చిరునవ్వు చిందించగా, ఆయనకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు కోహ్లి తన చేతిని ముందుకు పెట్టాడని ఇంకొరు ఈ ఫొటోకు భా​ష్యం చెప్పారు. టీమిండియా విజయం​ సాధించి ఫైనల్‌కు చేరాలని భారత క్రికెట్‌ అభిమానులు ఎంత బలంగా కోరుకుంటున్నారో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.