ఇక నుంచి అన్ని టైంల‌లో ఏటీఎంలు ప‌నిచేయ‌వు

ఇకపై రాత్రి 11 గంటల తరువాత జనసంచారం లేని ప్రాంతాల్లో, ఉదయం 5 గంటల్లోపు 5 కన్నా తక్కువ లావాదేవీలు నమోదయ్యే ఏటీఎం కేంద్రాలను మూసివేయాలని సైబరాబాద్ బ్యాంకర్లు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఏటీఎంల నిర్వహణా భారం పెరగడం, తక్కువ లావాదేవీలు జరుగుతూ ఉండటంతో రాత్రి వేళల్లో నిరుపయోగంగా ఉన్న ఏటీఎం సెంటర్లను డీలింక్ చేయాలని పోలీస్ కమిషనరేట్ లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో పోలీసులు చేసిన సూచనకు బ్యాంకర్లు సమ్మతించారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధాన కార్యాలయాలు తీసుకుంటాయని, విషయాన్ని హెడ్డాఫీస్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంలపై క్లోనింగ్ ముఠాలు కన్నేశాయని, వీటిల్లో స్కిమ్మర్లు, కెమెరాలు ఏర్పాటు చేసి కార్డుల వివరాలు తస్కరిస్తున్నాయని గుర్తు చేసిన అధికారులు వీటిని మూసేస్తేనే మంచిదని స్పష్టం చేశారు. తద్వారా నేరాలకు ఆస్కారం లేకుండా చూడవచ్చన్న పోలీసుల ఆలోచన. ఉన్న‌తాధికారుల నుంచి అనుమతి రాగానే ఏటీఎంలు టైం టూ టైం మాత్ర‌మే ప‌నిచేస్తాయ‌ని అర్ధ‌మవుతుంది.