ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా

ట్రంప్‌ నిర్ణయంపై మిత్రదేశాల విచారం

ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంపై అమెరికా మిత్రదేశాలు విచారం వ్యక్తంచేశాయి. ఐరోపా, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాలు ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా దీనిపై ఆందోళన వ్యక్తంచేశాయి. తాము ట్రంప్‌ నిర్ణయం పట్ల ఆందోళన చెందుతున్నామని నిన్న బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కొనసాగించాలని మిత్ర దేశాలు చెప్పినప్పటికీ ట్రంప్‌ ఈ సంచలన ప్రకటన చేశారు. వారి దేశాల సంయుక్త భద్రతకు సంబంధించి ఈ ఇరాన్‌ ఒప్పందం ఎంతో ముఖ్యమైనదని, ఈ ఒప్పందానికి అంతా కట్టుబడి ఉండాలని అందరినీ అడిగామని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరామని తెలిపారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఆరు దేశాలు రెండేళ్లపాటు చర్చించి ఈ ఒప్పందాన్ని చేశారు. ఇందులో భద్రతామండలిలోని శాశ్వత సభ్యదేశాలైన చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికాతోపాటు జర్మనీ కూడా పాలుపంచుకున్నాయి. ఐరాస భద్రతా మండలి తీర్మానంతో దీన్ని అంతర్జాతీయ చట్టంగా మార్చారు.

అమెరికా ఇరాన్‌ ఒప్పందం నుంచి వైదొలిగే అంశంపై మిత్ర దేశాలను సంప్రదించిందని ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్ వెల్లడించారు. ట్రంప్‌ ప్రకటనకు ముందే యూరోపియన్‌ సహా ఇతర మిత్రదేశాలను ఈ విషయంపై ఇప్పటికే సంప్రదించామని, దీనిపై పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని బోల్టన్‌ ‌ వైట్‌హౌస్‌లో విలేకరులకు తెలిపారు. నిన్న ట్రంప్‌ పలువురు నేతలకు ఫోన్‌ చేసి మాట్లాడారని, ఇంకా చేస్తారని చెప్పారు. రేపు బ్రిటిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో తాను చర్చిస్తానని బోల్టన్‌ తెలిపారు.

వ్యతిరేకించిన రష్యా.. సమర్థించిన సౌదీ అరేబియా

ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం పట్ల రష్యా, సిరియా కూడా వ్యతిరేకత వ్యక్తంచేశాయి. ట్రంప్‌ నిర్ణయం పట్ల చాలా నిరాశ చెందామని రష్యా విదేశాంగ మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్‌కు శత్రుదేశమైన సౌదీ అరేబియా మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. ట్రంప్‌ నిర్ణయానికి ‘మద్దతిస్తున్నామని, ఆహ్వానిస్తున్నామని’ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి వెల్లడించారు. అలాగే గల్ఫ్‌లో సౌదీ మిత్రపక్షాలైన యూఏఈ, బహ్రెయిన్‌ కూడా ట్రంప్‌ నిర్ణయానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి.