ఎందుకు మగాళ్లుగా పుట్టామని అనుకోకపోతే అడగండి: ఎన్టీఆర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘మహానటి’లో రామారావుగారి పాత్రలో నటించమని నన్ను అడిగారు. అయితే ఆయన పాత్రను పోషించేంత ధైర్యం నాకు లేదు’ అని అన్నారు యువ కథానాయకుడు ఎన్టీఆర్‌. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్‌ టైటిల్‌రోల్‌ పోషించిన చిత్రమిది. దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, సమంత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మంగళవారం జరిగిన ఆడియో విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ స్టేజ్‌మీద నిలబడి సావిత్రి హుందా గురించి, ఆవిడ గొప్పదనం గురించి మాట్లాడే అర్హత మాకు లేదు. బహుశా ఎన్ని జన్మలెత్తినా రాదేమో. నిజమైన సూపర్‌స్టార్‌ సావిత్రిగారు. ఆవిడ ఎలా చనిపోయారనే దాని కన్నా, ఆవిడ ఎలా బతికారో కళ్లకు కట్టినట్టు చూపించే చిత్రమిది. కొంతమంది జీవితం తెలుసుకోవడం మనకు చాలా అవసరం. కొంతమంది సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకోవడం అవసరం. కొంతమంది జీవితం నిజంగా మనకు అవసరం. అలాంటి అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని మన కళ్లకు కట్టినట్టు తీసుకురాబోతున్నాడు నాగీ. అతనికి ఎంత అనుభవం ఉందనే దానికంటే సావిత్రిగారిపై ఎంత ఇష్టం ఉన్నదనేది ముఖ్యం. నిజంగా అతను ఒక అభిమానిలా ఈ సినిమా తీశాడు. తను కన్న కలని, స్వప్న, ప్రియాంక వాళ్లను కన్నదత్తుగారు తప్ప ఎవరూ నిజం చేయలేదు. ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నప్పుడు మనం అన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి. చాలా మంది దాన్ని దేవుడు. అంటాం. కానీ నేను నేచర్‌ అంటా. ఆ నేచరే కీర్తి సురేష్‌, దుల్కర్‌, విజయ్‌, సమంతలను తీసుకొచ్చింది. పెద్ద వాళ్లు భౌతికంగా మనల్ని విడిచి వెళ్లినా, ఇక్కడే ఉంటారు. అసలు సావిత్రిగారే పట్టుబట్టి నా చిత్రం తీయమని చెప్పారేమో. ఈ చిత్రంలో తాతగారి పాత్రను నేను చేస్తే బాగుంటుందని స్వప్న నా దగ్గరకు వచ్చారు. నేను చాలా సార్లు చెప్పాను. ఆయన వేషం వేసే అర్హత నాకు లేదు. ఆయన పాత్ర పోషించడం ఈ జన్మలో జరగని పని. ఎందుకంటే ఈ సినిమాలో రామారావుగారి పాత్రను చేసే దమ్ము నాకు లేదు. కానీ, ఇందులో నటించిన దుల్కర్‌, విజయ్‌, కీర్తి, సమంతలకు నిజంగా హాట్సాఫ్‌. ఈ నలుగురు వారి పాత్రల్లో జీవించారు. సినిమా విడుదలైన తర్వాత అది మీకు తెలుస్తుంది. మిక్కీ చక్కని సంగీతం అందించారు. స్వప్న ఇంత గొప్ప సినిమా తీస్తారని అనుకోలేదు. ఈ మధ్య ఆడవాళ్లపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత మనం ఎందుకు మగాళ్లుగా పుట్టామని అనుకోకపోతే అడగండి. ఈ సినిమా చూసిన తర్వాతైనా మహిళలను గౌరవిస్తారని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు.’’ అని అన్నారు.