ఎన్నో వాగ్దానాలతో ప్రజల ముందుకు..జూలి

ఎన్నో వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తానని, రాజకీయ రంగంలో కలుసుకుందామంటూ ‘జల్లికట్టు’ జూలి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. జయలలిత మరణానంతరం రాష్ట్రంలోని రాజకీయ శూన్యత భర్తీచేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ప్రారంభమైన నేపథ్యంలో జూలి ప్రకటన సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. మెరీనా బీచ్‌లో జరిగిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొని ‘చిన్నమ్మ.. చిన్నమ్మ, ఓపీఎస్‌ ఎంగేమ్మ’ (చిన్నమ్మ.. చిన్నమ్మ, ఓపీఎస్‌ ఎక్కడమ్మా) అంటూ నినాద గళం విప్పి మీడియా దృష్టిని ఆకర్షించిన యువతి జూలి. అప్పట్లో ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. డీఎంకే ప్రోద్బలంతోనే ఆమె ఆ తరహా నినాదాలు చేశారనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. తర్వాత కొద్ది రోజులపాటు ఆమె గురించి ఊసే లేకపోగా హఠాత్తుగా ‘బిగ్‌ బాస్‌’ కార్యక్రమం ద్వారా మళ్లీ తెరపై ప్రత్యక్షమయ్యారు. ఈ కార్యక్రమంతో ప్రేక్షకాదరణ కూడా పొందారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా పనిచేస్తూ, టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. నీట్‌లో ఉత్తీర్ణత సాధించని కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని అనిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధాన పాత్రలో ఆమె నటించనున్నారు.
వీడియో విడుదల…
తాను రాజకీయాల్లోకి వస్తానంటూ ఇటీవల ఆమె ఓ సంచలన ప్రకటన చేశారు. ఆమె విడుదల చేసిన ఓ వీడియోలో ‘‘రజనీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? కమల్‌ అధికారం చేజిక్కించుకుంటారా? లేదా? ఆర్జే బాలాజీ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు? మన ప్రజలకు ఎవరు మంచి చేస్తారు? అందుకే నేను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాను. మనమందరం కలిసి విజయం సాధిద్దాం’’ అని తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా దానిపై పలు అభిప్రాయాలు వినిపించాయి. ఏదైనా సినిమా ప్రకటన కోసం ఆ వీడియో వైరల్‌ చేశారా? నిజంగానే ఆమె రాజకీయ ప్రవేశం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ వీడియోలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ల ప్రస్తావన ఉండటంతో నటుల రాజకీయాలపై ప్రజల ఆసక్తిని దృష్టిని మళ్లించడానికి ఏదైనా రాజకీయ పార్టీ ప్రోద్బలంతో ఈ వీడియో విడుదల చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో వీడియో విడుదలైంది. మాతృదినోత్సవ శుభాకాంక్షలతో విడుదల చేసిన ఆ వీడియోలో ‘ఒక ఓటుకు రూ. లక్ష, అన్ని ఇళ్లకు ఉచిత వాషింగ్‌ మెషిన్‌, ఏసీ; రోజూ వెయ్యి లీటర్ల నీరు, పిల్లలకు ఉన్నత విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం, అతి ముఖ్యంగా రూపాయికే టాస్మాక్‌ మద్యం’ అంటూ వాగ్దానాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ‘ఇలా జోలపాడి, ప్రశంసించి, స్నానం చేయించే ఒక పార్టీ వస్తే ఎలా ఉంటుంది?’ అని అవి తన వాగ్దానాలు కాదనే విషయాన్ని స్పష్టం చేస్తూ రాజకీయ సెటైర్‌ వేశారు. ‘ఎవరేం చెప్పినా మనం వింటాం. కానీ, గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని అడగుతామా ఏంటి?’ అంటూ మరో రాజకీయ విమర్శ చేశారు. తాను వెయ్యి హామీలతో వస్తున్నానని, త్వరలో రాజకీయ రంగంలో కలుసుకుందామని, నిరీక్షించి చూడాలని కూడా ఆ వీడియోను ముగించారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావడం ఖాయమనే నిర్ధరణకు అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. జూలిని వేరొక రాజకీయ పార్టీ పావుగా ఉపయోగిస్తోందని, రాష్ట్ర ప్రజలపై కొత్త పార్టీల ప్రభావం కనిపించకుండా వ్యూహాత్మకంగా ఆమెను రంగంలోకి దించుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భాజపాలో చేరి సేవ చేస్తానంటూ గతంలో జూలి చేసిన వ్యాఖ్యల ఆధారంగానూ పలువురు రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. ఆదివారం జూలి వీడియో వెలువడటమే తరువాయిగా నెటిజన్లు మీమ్స్‌ను వైరల్‌ చేశారు. మరో జయలలిత జూలి అనే అర్థం వచ్చేలా కొన్ని… రజనీ, కమల్‌హాసన్‌లకు రాజకీయ పోటీగా రంగప్రవేశం చేసేలా పలు మీమ్స్‌ను నెటిజన్లు సృష్టించారు.