ఏకంగా రూ.9 లక్షల కోట్లు బంగారం దొరికింది!

గత ఆదివారం మనమందరం సినిమాలు చూస్తూ.. షాపింగ్‌లు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో.. మన దేశానికి దూరంగా.. అంటే దాదాపు 5 వేల కిలోమీటర్ల దూరంలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది. దక్షిణ కొరియాకు సంబంధించిన ఉలంగ్డో ద్వీపానికి సమీపంలోని సముద్ర గర్భంలో ఓ పాత నౌక తాలూకు శకలాలను పరిశోధకులు కనిపెట్టారు. అది ఓ రష్యా యుద్ధ నౌక. 113 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయింది. పేరు దిమిత్రి డన్‌స్కోయ్‌. అయితే.. ఏంటి? మనకేం సంబంధం అన్నట్లు చూస్తున్నారా? భారతీయులం బంగారం అంటే పడిచస్తాం. అందుకే ఇది మనకు చాలా ఇంపార్టెంట్‌. ఆసక్తికరమైన విషయమే. ఎందుకంటే.. 1905లో ఈ నౌక సముద్రంలో మునిగిపోయే టైముకి.. ఇందులో బోలెడంత బంగారం ఉంది. ఎంతో తెలుసా? ఇప్పటి రేటు ప్రకారం చూస్తే దాని విలువ.. ఏకంగా రూ.9 లక్షల కోట్లు!!
ఆ.. అంటూ తెరిచిన నోరును అలాగే మూసేయండి. విషయం పూర్తిగా వినేయండి మరి..

1905లో రష్యాకు జపాన్‌కు మధ్య యుద్ధం. అందులో జపాన్‌దే పైచేయి. రష్యా యుద్ధ నౌకలు బాగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో దిమిత్రి డన్‌స్కోయ్‌ అనే ఈ యుద్ధ నౌక సైనికులకు వేతనాలు తదితరాల కోసం భారీ ఎత్తున బంగారాన్ని తీసుకెళ్తోంది. మిగిలిన యుద్ద నౌకలు బాగా దెబ్బతినడంతో అందులో ఉన్న బంగారాన్ని కూడా ఇందులోనే పెట్టారు. మొత్తం 5,500 బాక్సుల బంగారం. ఈ నౌక జపాన్‌ దాడిని తప్పించుకుంది. అయితే, ఉలంగ్డో ద్వీపానికి సమీపంలో ఆ దేశ యుద్ధ నౌకలకు దొరికిపోయింది. దాడిలో బాగా దెబ్బతింది. సైనికులు చనిపోయారు. నౌక మునిగిపోయింది. తర్వాత చాలామంది వెతికినా దొరక లేదు. పట్టించుకోవడం మానేశారు.

మళ్లీ ఇన్నాళ్లకు అదీ రష్యాలో ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరుగుతున్న సమయంలో ఆ దేశానికి చెందిన నౌకను దక్షిణ కొరియాకు చెందిన షినల్‌ గ్రూప్‌ కనుగొంది. ఉలంగ్డో తీరానికి మైలు దూరంలో.. 1,400 అడుగుల లోతులో ఇది దొరికింది. గత కొన్నేళ్లుగా ఈ గ్రూపు నౌక కోసం సముద్ర గర్భంలో చిన్నపాటి సబ్‌మెరైన్లతో గాలిస్తోంది. సముద్రంలో దొరికిన నౌక శకలాలు దిమిత్రి డన్‌స్కోయ్‌వే అని వారు నిర్ధారించారు. అంతేకాదు.. అందులో ఇనప్పెట్టెలు కూడా ఉన్నాయట. అయితే.. డైవర్లు వాటిని తెరవలేకపోయారని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

అంతా అనుకూలంగా సాగితే.. అక్టోబర్, నవంబర్‌ నాటికి ఈ నౌక శకలాలను పైకి తెస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆ పసిడి మాదంటే మాదంటూ వాటాల రాజకీయం మొదలైంది. అది తమదని.. మొత్తం బంగారం మాకే దక్కాలని రష్యాలోని పలు గ్రూపులు డిమాండ్‌ చేయగా.. రష్యాకు తాము కొంత వాటాను మాత్రమే ఇస్తామని.. మిగతాదంతా మాదేనని సదరు కంపెనీ చెబుతోంది. ఇంతా చూస్తే.. లోగుట్టు ఆ బాక్సులకే ఎరుక.. ఎందుకంటే.. అవి తెరిస్తే గానీ.. అందరూ అనుకున్నట్లుగా అందులో బంగారం ఉందా లేదా అన్నది వెల్లడవుతుంది. అంతలోపే ఈ వాటాల గొడవ మొదలైంది. అందుకే ఓ సినీ కవి అన్నారుగా.. డబ్బెవరికి చేదు.. పిచ్చోడా..