ఏటీఎంలో డబ్బులు డ్రా చేసారా.. తస్మాత్‌ జాగ్రత్త!

 

అసలే ఏటీఎంల వద్ద ‘నో క్యాష్‌’ బోర్డులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగదు లభించక నానా తంటాలు పడుతున్నారు. ఏదైనా ఏటీఎంలో డబ్బులు లభిస్తే చాలు సంబరపడిపోతున్నారు. అయితే డబ్బులు ఉన్న ఓ ఏటీఎంలో నగదు డ్రా చేసిన అనంతరం కూడా వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే వచ్చింది నకిలీ కరెన్సీ మరి.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని సుభాష్‌నగర్‌లో ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు పెట్టారని తెలిసి స్థానికులు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. తీరా డబ్బులు తీసుకున్నాక మాత్రం షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే అందులోంచి నిజమైన నోట్లు కాకుండా నకిలీ కరెన్సీ నోట్లు వచ్చాయి. రూ.500 నోట్లపైన ‘చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఇంగ్లిష్‌లో, ‘భారతీయ మనోరంజన్‌ బ్యాంక్‌’ అని హిందీలో రాసి ఉంది. ఇలాంటి నకిలీ రూ.500 నోట్లు ముగ్గురికి రావడం గమనార్హం.

ఆదివారం సాయంత్రం అశోక్‌కుమార్‌ అనే వ్యక్తి ఆ ఏటీఎం నుంచి రూ.4500 డ్రా చేశాడు. అయితే ఏటీఎం నుంచి వచ్చిన రూ.500 నోట్ల విషయంలో పెద్ద తేడా ఏమీ అతనికి కనిపించలేదు. అయితే నోట్లను కాస్త దగ్గరగా పెట్టుకుని చూస్తే మాత్రం అందులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు బదులు చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని అక్షరాలు కనిపించాయి. మరోవైపు హిందీ అక్షరాల్లో కూడా తేడా ఉంది. వెంటనే అతను ఏటీఎంలో ఉన్న కెమెరా వైపు ఆ నోట్లను చూపించి బ్యాంక్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతనికంటే ముందుగా మరో ఇద్దరికి కూడా ఇలాంటి నకిలీ నోట్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఏటీఎం ముందు పెడుతున్న నో క్యాష్‌ బోర్డులే కాదు.. అందులోని నకిలీ కరెన్సీ నోట్లు కూడా ఇప్పుడు వినియోగదారులను వెక్కిరిస్తున్నాయని పలువురు అంటున్నారు.

ఏటీఎంలలో క్యాష్‌ను నింపే ఏజెన్సీకి చెందిన వ్యక్తులే నకిలీ కరెన్సీ నోట్లను పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. గతంలో కూడా దేశ రాజధానితోపాటు పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో కూడా ‘చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని రాసి ఉన్న నకిలీ నోట్లు వచ్చిన విషయం తెలిసిందే.