ఏపీలో భారీ వర్షాలు ప్రాంతాలు మొత్తం జలమయం.

విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురిసింది. భీమిలి, పద్మనాభం, పాడేరు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. విజయ నగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఏజెన్సీ ప్రాంతాలైనా జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వర్షాలతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి.అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి తోటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో భారీగా ఈదురుగాలు వీస్తుండటంతో పిడుగులు పడే ‍ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

సచివాలయంలోకి మళ్లీ వర్షపు నీరు
భారీ వర్షంతో ఏపీ సచివాలయంలోకి మళ్లీ వర్షపు నీరు చేరింది. భవనాలు పూర్తిగా తడిసిపోవడంతో అక్కడక్కడ సీలింగ్‌ ఊడిపోయి నీరు కార్యాలయంలోకి ప్రవేశించింది. మున్సిపల్‌ మంత్రి నారాయణ ఛాంబర్‌లో సీలింగ్‌ ఎగిరిపోవడంతో సిబ్బంది ఛాంబర్‌ తలుపులు మూశారు. సచివాలయంలోకి వర్షం నీరురావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. సీలింగ్‌లు ఊడిపోవడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఛాంబర్‌ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఛాంబర్‌లోకి ఎవరూ వెళ్లకూడదని, ఫోటోలు, వీడియోలు తీయకూడదని ఆంక్షలు విధించారు.