ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవితో తనకున్న అనుబంధం గురించి చెప్పిన.. దీపిక పదుకొణె

ముంబయి: దివంగత నటి శ్రీదేవి తనకు తల్లిలాంటి వారని అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె. శ్రీదేవి హఠాన్మరణం చెందినప్పుడు అనిల్‌ కపూర్‌ నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తి దీపికనే. జాన్విని ఓదారుస్తూ ఆమెతోనే ఉన్నారట. ఆ తర్వాత శ్రీదేవి అంత్యక్రియల నిమిత్తం బెంగళూరు నుంచి ముంబయి వెళ్లారు. శ్రీదేవితో తనకున్న అనుబంధం గురించి దీపిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘శ్రీదేవితో నాకు సినిమాలకు మించిన అనుబంధం ఉంది. ఆమె నాకు తల్లిలాంటివారు. నేను చేసిన ప్రతి సినిమా చూసి బోనీ కపూర్‌, శ్రీదేవి నాకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పేవారు. ఆమెతో ఉంటే నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. దుబాయ్‌కి వెళ్లడానికి కొద్ది రోజుల ముందు శ్రీదేవి నాతో మాట్లడారు. కానీ ఆమె అక్కడే చనిపోతారని అస్సలు ఊహించలేదు. ఆమె ఇక లేరని తెలిసి షాకయ్యాను.’ అని చెప్పుకొచ్చారు దీపిక.

శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. మరోపక్క దీపిక ప్రస్తుతం ‘సప్నా దీదీ’ అనే బయోపిక్‌లో నటిస్తున్నారు. విశాల్‌ భరద్వాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ముంబయికి చెందిన మాఫియా క్వీన్‌ రహీమా ఖాన్‌ జీవితాధాంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో దీపిక రహీమా ఖాన్‌ పాత్రలో..ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ దావూద్‌ ఇబ్రహీం పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.