కట్నం ఇవ్వలేదని స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం

అస్సాంలో జరిగిన ఓ దారుణం అత్యంత క్రూరమైన సంఘటల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నూరేళ్లు తోడుంటానని, కడవరకు అండగా నిలుస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కట్టుకున్న భార్యపై కర్కషంగా ప్రవర్తించాడు. సరిగ్గా పెళ్లై మూడు రోజులు కూడా పూర్తవ్వక ముందే పెళ్లి నాటి ప్రమాణాలకు తిలోదకాలిచ్చి స్నేహితులతో కలిసి పైశాచికానికి ఒడిగట్టాడు. తాను కోరినంత కట్నం ఇవ్వలేదని మిత్రులతో కలిసి జీవిత భాగస్వామిపై అత్యాచారం చేశాడు. బంగారు ఆభరణాలను కట్నంగా ఇవ్వాలని తన భర్త కోరగా, తమ కుటుంబం ఇవ్వలేకపోవడంతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి భర్త తనపై లైంగిక దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

అస్సాంలోని కరీంగంజ్‌లో ఈనెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అరెస్ట్‌ చేసి మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధిత మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో ఈ దారుణం పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న అత్యాచార ఘటనలపై ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గాత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 18 అత్యాచార కేసులు అధికార రికార్డుల్లో నమోదవగా, ఈ సంవత్సరం నాలుగు నెలల్లోనే 18 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా వీటి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.