కరుణానిధిపై అమూల్‌ ట్వీట్‌, వైరల్‌

ప్రముఖ డయిరీ సంస్థ అమూల్‌ చేసే సృజనాత్మక ప్రకటనలు.. భారతీయ అడ్వర్‌టైజింగ్‌లో ఎంతో ఉన్నతంగా నిలుస్తూ ఉంటాయి. క్రియేటివ్‌ కమ్యూనికేషన్స్‌లో అమూల్‌ మించిపోయిన వారు ఇంకెవ్వరూ ఉండరని అది చాలా సార్లు నిరూపించుకుంది. తమిళనాడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరుణానిధికి నివాళులర్పించేందుకు అమూల్‌, ఓ సృజనాత్మక ప్రకటనను విడుదల చేసింది. కరుణానిధిని ‘తమిల్‌ తలైవార్’గా అభిర్ణిస్తూ.. ఓ క్రియేటివ్‌ పిక్చర్‌ను ట్విటర్‌లో పోస్టు చేసింది.

ఈ పిక్చర్‌లో కరుణానిధి తన ఆటోమేటిక్‌ చైర్‌లో తెల్లటి వస్త్రాలతో కూర్చుని ఉంటారు. తన సిగ్నేచర్‌ కళ్లద్దాలు, మెడలో కండువతో ఈ పిక్చర్‌ను రూపొందించింది. అమూల్‌ పాప, ఈ తలైవార్‌కు అభినందనలు తెలుపుతున్నట్టు ఈ పిక్చర్‌లో ఉంది. దీంతో పాటు కరుణానిధి స్క్రీన్‌రైటింగ్‌ కెరీర్‌కు కూడా అమూల్‌ నివాళులర్పించింది. గొప్ప రచయిత, రాజకీయవేత్త అని అభివర్ణించింది. అమూల్‌ ఈ ప్రకటనకు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ ట్వీట్‌, 1500 సార్లకు పైగా రీట్వీట్‌ కాగ, 4,873 లైక్‌లు వచ్చాయి. అమూల్‌ సృజనాత్మకను కొందరు అభినందిస్తుండగా…. మరికొంత మంది అభిమానులు కరుణానిధిని చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. ​