కర్నూల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు హామీ

తిరుపతి శ్రీసిటీతో సమానంగా ఓర్వకల్లు పారిశ్రామిక నగరాన్ని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు గుట్టపాడు వద్ద రూ.3 వేల కోట్లతో చేపట్టిన జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలతోనూ, బహరంగ సభలోనూ మాట్లాడారు. ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తున్నందుకే నవ్యాంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు వ్యవస్థాపకులు ముందుకొస్తున్నట్లు తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 2,850 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయన్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు 36.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అందుతాయన్నారు. ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపనలు చేయగా వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. సింగపూర్‌తో అనుసంధానం పెట్టుకున్నామని, ఇతర దేశాల్లో పరిశ్రమల ఏర్పాటులో ఎలా మెరుగ్గా చేస్తున్నారో అధ్యయనం చేసి ఇబ్బందుల్లేకుండా వసతులు సమకూర్చి శ్రీకారం చుట్టామన్నారు.
రాష్ట్రంలో రాత్రింబవళ్లు పనిచేసే బృందం
రాత్రింబవళ్లు పనిచేసే రాజకీయ, అధికార బృందం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టే పరిశ్రమలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు చిరునామాగా ఏపీ ఉంటుందన్నారు. ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపురానికి కియో ప్రతిపాదన వచ్చినప్పుడు నీరు ఎక్కడి నుంచి ఇస్తారన్న ప్రశ్న ఎదురైందన్నారు. ఆరునెలల సమయం అడిగి చెర్లోపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు ఇచ్చి ఇంతకంటే అనువైన స్థలం లేదనే పరిస్థితి తీసుకొచ్చామని గుర్తుచేశారు. 13 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 11 వేల మందికి ఉద్యోగావకాశాలు కియో వల్ల కల్గుతున్నాయన్నారు.

రాయలసీమ ఇకపై రత్నాలసీమ
రాయలసీమ రత్నాలసీమగా మారుస్తానన్న నా మాట ఈరోజుతోనే ప్రారంభమైందని సీఎం అన్నారు. రాయలసీమలో ఒకప్పుడు పరిశ్రమల్లేవని, గత ప్రభుత్వంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎవ్వరూ పెట్టొదన్న యురేనియం పరిశ్రమను పులివెందులకు తీసుకువచ్చి పంటల నష్టంతోపాటు, ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. పట్టిసీమ పూర్తిచేసి కృష్ణాడెల్టా వాటానీటిని 140 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చి చరిత్ర సృష్టించామన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత భూగర్భ జలాలు బాగున్న జిల్లా కర్నూలు అన్నారు. ప్రాజెక్టులు తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చారు. అమెరికాలోని ఆయోవా భాగస్వామ్యంతో తంగడంచెలో 650 ఎకరాల్లో మోగాసీడ్‌ పార్కుకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రపంచానికి విత్తనాలు సరఫరా చేసే కేంద్రంగా దీన్ని మలుస్తామన్నారు.

అభివృద్ధిలో ఆంద్రప్రదేశ్‌ను ముందుంచుతా
పిల్లలకు బంగారు భవిష్యత్తు కలిగేలా ఆంధ్రప్రదేశ్‌ను సైతం అభివృద్ధిలో ముందుచుతానని ముఖ్యమంత్రి తెలిపారు. వివిధ కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.11 వేల కోట్లు విలువజేసే భూములు కేటాయించామన్నారు. కానీ కేంద్రం అరకొర డబ్బులివ్వడం చూస్తుంటే ఇంకా 30 సంవత్సరాలైనా అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక హోదాపై చర్చలో ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు తిరుపతిలో, ఎన్నికల తర్వాత అమరావతిలో ఇచ్చిన హామీలపై ప్రసంగాన్ని దాదాపు ఐదు నిమిషాల నిడివి గల దృశ్యాలను ప్రదర్శించారు.