కలకలం రేపిన అపరిచితుడు!

అపరిచితుడు కలకలం రేపాడు. సంజీవపురం సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లోకి ఆదివారం అర్ధరాత్రి అపరిచిత వ్యక్తి చొరబడి ఆరో తరగతి విద్యార్థిని గొంతు పట్టుకుని నులిమాడని, అయితే ఆ విద్యార్థి అరవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని తోటి విద్యార్థినులు తెలిపారు. నైట్‌వాచ్‌మన్, టీచర్‌ విద్యార్థినుల వద్దకు వెళ్లి విచారణ చేశారు. సోమవారం ఉదయం స్పెషలాఫీసర్‌ మాధవి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.

అందులో ఎక్కడా అపరిచితుడు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె ధర్మవరం రూరల్‌ సీఐ శివరాముడు, ఎస్‌ఐ హారున్‌బాషాలకు సమాచారమందించారు. అనంతరం బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. విద్యార్థినులు కలలుకంటూ భయాందోళన చెంది ఉంటారని, అపరిచిత వ్యక్తి సంచరించిన ఆనవాళ్లు పరిసరాల్లో ఎక్కడా లభించలేదని కొట్టిపారేశారు.