కాంగ్రెస్‌-జేడీఎస్‌ పిటిషన్లను తోసిపుచ్చిన: సుప్రీంకోర్టు

కర్ణాటక రాజకీయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప నేడు తన బలాన్ని నిరూపించుకోనున్న నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా నియమించారు. అయితే ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ పిటిషన్లను తోసిపుచ్చి.. ప్రొటెం స్పీకర్‌గా బొపయ్యనే కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌-జేడీఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తన వాదనలు వినిపించారు. ‘ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను నియమించడం సంప్రదాయాలకు విరుద్ధం. ఎక్కువ సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవాలి. కానీ గవర్నర్‌ బోపయ్యను నియమించారు. శాసనసభ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడానికైతే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. ఆయనే విశ్వాసపరీక్షను చేపట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’ అని సిబల్‌ అన్నారు.

బోపయ్య బలపరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇవ్వకూడదని సిబల్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఈయన్నే నియమించాలని చట్టం ఎలా ఆదేశిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ‘యడ్యూరప్ప ప్రమాణస్వీకారం విషయంలో మేం అర్ధరాత్రి విచారణ చేపట్టాం. కానీ ఇప్పుడు మీరు ప్రొటెం స్పీకర్‌ విషయంలోనూ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. కానీ ప్రొటెం స్పీకర్‌ను మేం ఎలా నియమించగలం. ఈ విషయంలో గవర్నర్‌ను ఆదేశించడం చట్టంలో లేదు. సీనియర్‌ సభ్యులే ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికవడం అనేది సంప్రదాయం. అయితే దానికి చట్టబద్ధత లేదు. అంతేగాక గతంలోనూ సీనియర్‌ సభ్యులు కాని వారు ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన సందర్భాలున్నాయి. ఒకవేళ మీరు అంతగా అడిగితే స్పీకర్‌కు నోటీసులు పంపి.. విశ్వాసపరీక్షను వాయిదా వేస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది.

వాదోపవాదాల అనంతరం కాంగ్రెస్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. బోపయ్య ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారని, సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరగాలని స్పష్టం చేసింది. అయితే ఈ విశ్వాస పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించింది.