కాంగ్రెస్‌ నుంచి వస్తే చేరదీసిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు

మా దయతో టీడీపీ అధికారంలోకొచ్చింది..

కర్ణాటక రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేదని ఏపీ బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్‌ వాలా నిర్ణయాలపై చంద్రబాబుకు ఎందుకు అంత అనుమానమోస్తుందో అందరికీ తెలుసునన్నారు. గతంలో ఎన్నో పర్యాయాలు కేంద్రంలో బీజేపీకి మద్దతివ్వకుండా ప్రభుత్వాలు కూల్చే యత్నాలు చేసిన చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తుందని పేర్కొన్నారు. 1996లో చంద్రబాబు లాంటి నేతలు మద్దతు ఇవ్వకపోవడంతో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్‌ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు, కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ అధినేత దేవెగౌడను ప్రధానిని చేశారు. మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి దేవెగౌడను పదవీచ్యుతుడిని చేసి ఐకే గుజ్రాల్‌ను ప్రధానిని చేశారు.

సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘కర్ణాటక ఎన్నికల సమయంలోనూ బీజేపీని ఓడించాలని స్వయంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి, మామ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబు సొంతం. బీజేపీని ఓడించేందుకు ఉద్యోగ సంఘాల నేతలను సైతం కర్ణాటకకు చంద్రబాబు పంపించడం నిజం కాదా. బీజేపీకి ఓటింగ్ శాతం 19 నుంచి 35కి పెరిగింది. కర్ణాటకలో బీజేపీకి 104 సీట్లొచ్చాయి. మరో 20 స్థానాలలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోంది. అందుకే కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని యత్నాలు చేశారు. తెలుగువాళ్లు బీజేపీకి ఓట్లేయద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. కానీ తెలుగువాళ్లు ఉన్న పద్మనాభనగర్‌లో 35వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలుపొందింది.

పరిపాలనను గాలికొదిలేసి కేవలం ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడం పైనే చంద్రబాబు దృష్టిపెట్టడం వల్ల ఏపీలో అరాచకాలు, అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యక్తే తనకు రక్షణ కల్పించాలని ప్రజలను కోరిన సీఎం చంద్రబాబు. ప్రజల నుంచే రక్షణ ఆశించే చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఎవరైనా ఓటేస్తారని భావిస్తున్నారా. ఇటీవల జరిగిన బోటు ప్రమాదం ఘటనే చంద్రబాబు పరిపాలనకు నిదర్శనం. పుజారి వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. దేశ ప్రజలంతా అభిమానించే వెంకటేశ్వరస్వామి రక్షణ భాద్యత ఎవరిది’ అంటూ సోము వీర్రాజు మండిపడ్డారు.