కీలక పోరులో రాజస్థాన్‌దే పైచేయి

ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌.. ఈ ఐపీఎల్‌ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసి, పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన జట్లు. ఐతే ప్లేఆఫ్‌ ఆశలు చాలా సంక్లిష్టంగా మారుతున్న దశలో అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో మళ్లీ రేసులోకి దూసుకొచ్చాయి ఈ రెండు జట్లూ. వీటి మధ్య కీలక పోరులో రాజస్థాన్‌దే పైచేయి అయింది. తన సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌ని ముంబయి గొప్పగా ఆరంభించినా.. మధ్యలో రాయల్స్‌ పుంజుకుంది. బౌలర్లు ఆతిథ్య జట్టుకు కళ్లెం వేస్తే.. తర్వాత జోస్‌ బట్లర్‌ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టుకు హ్యాట్రిక్‌ విజయాన్నందించాడు. ఈ మూడు విజయాల్లోనూ అతడే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం విశేషం. 12 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది ఆరో విజయం కాగా.. ముంబయికి ఏడో ఓటమి. రాయల్స్‌ గెలుపుతో నాలుగు జట్లకు మించి ఎనిమిది విజయాలు సాధించే అవకాశం లేకపోవడంతో చెన్నై ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఆ జట్టు ఆదివారమే ఎనిమిదో విజయం (సన్‌రైజర్స్‌పై) సాధించింది.
ముంబయి
ఐపీఎల్‌-11 ప్లేఆఫ్‌ రేసు రసవత్తరంగా మారింది. వారం కిందటి వరకు పట్టికలో అట్టడుగున నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌.. ఇప్పుడు ప్లేఆఫ్‌కు గట్టి పోటీదారుగా మారింది. ఆదివారం ముంబయిని 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. మొదట ముంబయి 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఎవిన్‌ లూయిస్‌ (60; 42 బంతుల్లో 4×4, 4×6) టాప్‌స్కోరర్‌. 10 ఓవర్లలో 86/6తో నిలిచిన ముంబయికి రెండో అర్ధంలో రాయల్స్‌ పేసర్లు ఆర్చర్‌ (2/16), స్టోక్స్‌ (2/26) కళ్లెం వేశారు. అనంతరం బట్లర్‌ (94 నాటౌట్‌; 53 బంతుల్లో 9×4, 5×6) జోరులో 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పరిస్థితులకు తగ్గట్లు కొలిచినట్లు ఆడిన బట్లర్‌.. ఇన్నింగ్స్‌కు మూల స్తంభంలా నిలిచాడు. సంయమనం ప్రదర్శిస్తూనే.. అప్పుడప్పుడూ కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. షార్ట్‌ (4) తొలి ఓవర్లోనే వెనుదిరిగినా.. రహానె (37; 36 బంతుల్లో 4×4)తో కలిసి రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యం (95) నెలకొల్పడంతో రాయల్స్‌ పని తేలికైపోయింది. తర్వాత వచ్చిన శాంసన్‌ (26; 14 బంతుల్లో 2×4, 2×6) మెరుపు షాట్లతో ముంబయికి అవకాశమే లేకుండా చేశాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి బట్లర్‌ సిక్సర్‌తో పని పూర్తి చేశాడు.
అంత బాగా ఆరంభమైనా..: అంతకుముందు ముంబయికి చాలా మంచి ఆరంభం దక్కినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు సూర్యకుమార్‌ (38; 31 బంతుల్లో 7×4), లూయిస్‌ నిలకడను కొనసాగిస్తూ మరోసారి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వికెట్లు కాపాడుకుంటూనే ఓ మోస్తరు వేగంతో ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. తొలి పది ఓవర్లలో ఆ జట్టు వికెటే కోల్పోకుండా 86 పరుగులు చేసి తిరుగులేని స్థితిలో నిలిచింది. పవర్‌ ప్లే ముగిసేసరికే 51 పరుగులు చేసిన ఓపెనర్లు.. ఆ తర్వాత కొంచెం వేగం తగ్గించారు. ఐతే పది వికెట్లు చేతిలో ఉండి.. బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న ముంబయి రెండో అర్ధంలో చెలరేగిపోతుందని.. స్కోరు 200 ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ద్వితీయార్ధమంతా ఆ జట్టు తడబడింది. 11వ ఓవర్లో ఆర్చర్‌.. వరుస బంతుల్లో సూర్యకుమార్‌, రోహిత్‌ శర్మ (0)లను ఔట్‌ చేసి ముంబయిని గట్టి దెబ్బ తీయడంతో ఇన్నింగ్స్‌ లయ తప్పింది. లూయిస్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ (12) వెనుదిరిగారు. 15-18 మధ్య నాలుగు ఓవర్లలో ముంబయి 17 పరుగులే. ఐతే హార్దిక్‌ పాండ్య (36; 21 బంతుల్లో 3×4, 2×6) చివరి రెండు ఓవర్లలో చెలరేగి ఆడిన ఇన్నింగ్స్‌కు మంచి ముగింపే ఇచ్చాడు.
ముంబయి ఇండియన్స్‌: సూర్యకుమార్‌ (సి) ఉనద్కత్‌ (బి) ఆర్చర్‌ 38; లూయిస్‌ (సి) శాంసన్‌ (బి) ధవళ్‌ 60; రోహిత్‌ (సి) ఉనద్కత్‌ (బి) ఆర్చర్‌ 0; ఇషాన్‌ కిషన్‌ (సి) శాంసన్‌ (బి) స్టోక్స్‌ 12; హార్దిక్‌ పాండ్య (సి) శాంసన్‌ (బి) స్టోక్స్‌ 36; కృనాల్‌ పాండ్య (సి) గౌతమ్‌ (బి) ఉనద్కత్‌ 3; కటింగ్‌ నాటౌట్‌ 10; డుమిని నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168;
వికెట్ల పతనం: 1-87, 2-87, 3-108, 4-119, 5-131, 6-166;
బౌలింగ్‌: గౌతమ్‌ 2-0-23-0; ధవళ్‌ 4-0-43-1; ఆర్చర్‌ 4-0-16-2; స్టోక్స్‌ 4-0-26-2; గోపాల్‌ 2-0-21-0; ఉనద్కత్‌ 4-0-37-1

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: షార్ట్‌ (సి) కిషన్‌ (బి) బుమ్రా 4; బట్లర్‌ నాటౌట్‌ 94; రహానె (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ పాండ్య 37; శాంసన్‌ (సి) చాహర్‌ (బి) హార్దిక్‌ పాండ్య 26; స్టోక్స్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (18 ఓవర్లలో 3 వికెట్లకు) 171;
వికెట్ల పతనం: 1-9, 2-104, 3-165;
బౌలింగ్‌: బుమ్రా 3-0-34-1; మెక్లెనగన్‌ 4-0-28-0; కృనాల్‌ 4-0-24-0; హార్దిక్‌ 4-0-52-2; మార్కండే 3-0-32-0