కుప్పకూలిన భవనం.. ఐదుగురి మృతి

ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భవనం కూలిన ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉంది. వాయువ్య ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ఫేజ్‌3లో ఉదయం 9 గంటల 25 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో పదేళ్ల లోపు వయసు గల ఇద్దరు అన్నదమ్ములు, ఐదేళ్లలోపు వయస్సు గల ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన మహిళను మున్నీగా గుర్తించారు.

కాగా భవనం 20 ఏళ్ల క్రితం నాటిదని, శిథిలావస్థకి చేరుకోవడంతోనే ప్రమాదం జరిగిందని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి తెలిపారు. భవన శిథిలాల కింద ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు ఆరుగురితో కూడిన రెస్క్యూ టీమ్‌ పనిచేస్తోందని పేర్కొన్నారు.