కొత్త అల్లుడికి ట్రెయినింగ్ ఇచ్చిన ముకేశ్ అంబానీ..

ముకేశ్‌ అంబానీ.. పరిచయం అవసరం లేని పేరు. అలాంటి వ్యక్తికి అల్లుడు అయ్యే వ్యక్తి ఎవరని.. ఎవరికైనా ఆసక్తి ఉంటూనే ఉంటుంది. అంతే కాదు.. అతను ముకేశ్‌ అంత రాణిస్తాడో లేదో అన్న అనుమానం కూడా ఉంటుంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేయడానికో లేక ముందే ఉన్న స్నేహ బంధమో ఏమో తెలియదు కానీ.. కాబోయే అల్లుడు ఆనంద్‌ పిరమాల్‌కు ముకేశ్‌ ఏళ్ల కిందటే మార్గదర్శనం చేశాడు. ఇపుడు ఆనంద్‌ విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తగా నిలబడ్డాడంటే.. ఆ పునాదులు ముకేశ్‌వేనని చెప్పాలి.
ఈశాతో ఆనంద్‌ పెళ్లి డిసెంబరులో జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చేంత వరకు ఆనంద్‌ గురించి సామాన్యులకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ పిరమాల్‌ కుటుంబంతో ముకేశ్‌ కుటుంబానికి గట్టి బంధమే ఉంది. అది ఇపుడు మరింత ఆత్మీయ బంధం కానుంది.

సరిగ్గా.. ఎనిమిదేళ్ల కిందట వేసవి కాలం. పాతికేళ్ల ఆనంద్‌ హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చదువు పూర్తి చేసుకుని వచ్చారు. తన భవిష్యత్‌ కోసం ఎటువైపు అడుగులు వేయాలని నిర్ణయించుకోలేకపోతున్నారు. తన సహాధ్యాయులతో పాటు నడవాలా? లేదా తన సోదరి నందినిలా మెకిన్సే కన్సల్టెంట్‌గా మారాలా? లేదూ ఒక ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుదారుగా మారాలా? అన్న మీమాంసలో పడిపోయారు. అదే సమయంలో తన తండ్రి అజయ్‌ పిరమాల్‌ తమ ఫార్మా వ్యాపారంలోని మెజారిటీ వాటాను అబాట్‌కు విక్రయించారు. అంటే తన తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడానికి కూడా వీలులేదన్నమాట.

మరి ఏం చేయాలి. తన గ్రాడ్యుయేషన్‌కు.. బిజినెస్‌ స్కూల్‌కు మధ్య గ్రామీణ ఆరోగ్యం, టెలీ మెడిసిన్‌ అంకురాన్ని స్థాపించారు. అయితే అందులో ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. ఆ తర్వాత దాన్ని పిరమాల్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా విలీనం చేసుకున్నారు. ఇక చేసేదేమీ లేక న్యూయార్క్‌కి వెళ్లిపోవాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే ముకేశ్‌ మాటలు ఆనంద్‌ ఆలోచనలను పూర్తిగా మార్చాయి.

‘ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలా ఉండడం అనేది క్రికెట్‌ ఆడడం లాంటిది. అదే ఏ కన్సల్టెంటో లేదా సలహాదారుగా ఉండడమంటే.. క్రికెట్‌ చూస్తూ వ్యాఖ్యానం చెప్పడం లాంటిది. నువ్వు ఎక్కువ కాలం ఆట ఆడాలనుకుంటే.. సమయం వృథా చేయకుండా.. అవకాశాలను ఒడిసిపట్టుకోవాలి. అన్ని లక్ష్యాలను నీకు 30 ఏళ్లు వచ్చేసరికల్లా పూర్తి చేసుకోవాల’ంటూ ఆనంద్‌కు ముకేశ్‌ ఉపదేశం చేశారు. కేవలం మాటలు చెప్పడమే కాకుండా.. ఆనంద్‌ ఎదిగేందుకు ఉపయోగపడే వ్యక్తులను సైతం ఆయన ఆనంద్‌కు అందించారు. వాళ్లే.. హెచ్‌డీఎఫ్‌సీ దీపక్‌ పరేక్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ నితిన్‌ నోహ్రియాలు. వీళ్లిద్దరూ ఆనంద్‌ పిరమాల్‌కు కీలక రూపశిల్పులుగా వ్యవహరించారని చెప్పవచ్చు. పిరమాల్‌ రియాల్టీ సలహా బోర్డులో సభ్యులు. క్రమంగా ఆనంద్‌ తన బోర్డులోకి మరికొంత మంది దిగ్గజాలకు ఆహ్వానం పలికారు. దుబాయ్‌ని నిర్మించిన భారతీయులకూ ఆహ్వానం పలికారు. వారి ప్రత్యేక నైపుణ్యాలను తన కంపెనీకి ఉపయోగించుకోగలిగారు. స్థిరాస్తి విషయంలోనూ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాబర్ట్‌ బూత్‌ అనే వృత్తినిపుణుడికీ ఆహ్వానం పలికారు. ఇలా మేలు కలయికతో రియాల్టీలో రాణించారు. పిరమాల్‌ అసూరెన్స్‌ వంటి కొత్త కంపెనీలనూ ప్రారంభించారు.

అలా అలా ముకేశ్‌ సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు సాగారు. 2015లో ఆనంద్‌ అన్న మాట ముకేశ్‌కు ఆనంద్‌కు ఉన్న బంధాన్ని తెలుపుతుంది. ‘ఇపుడు మా నాన్న కంటే ఎక్కువ అనుబంధాన్ని ఆయన(ముకేశ్‌)తోనే కలిగి ఉన్నా’నంటూ అన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి రూ.1800 కోట్లు సమీకరించినా.. ఆ తర్వాత మూడు వారాలకే గోల్‌మాన్‌ శాక్స్‌ నుంచి రూ.978 కోట్లు సమీకరించినా అది ముకేశ్‌ ఇచ్చిన ఆశావహ దృక్పథంతోనే. ఇపుడు స్వయనా అల్లుడు అవుతున్న ఆనంద్‌ను ముకేశ్‌ ఏ విజయతీరాలకు చేరుస్తారో చూడాలి.