గడ్డం తీయకపోతే పాకిస్తానివే

దేశంలో కుల, మతాల మధ్య కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓవైపు గోరక్షణ పేరుతో ముస్లింలపై దాడులు కొనసాగుతుండగా.. తాజాగా గడ్డం పెంచిన ఓ ముస్లిం యువకుడిపై కొందరు దుండగులు దాడికి దిగారు. బలవంతంగా లాక్కెళ్లి షేవింగ్‌ చేయించారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. సెక్టార్‌ 29, మేవాత్‌ ప్రాంతంలో నివాసముండే జఫారుద్దీన్‌ హమీద్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు.

‘పాకిస్తానీలా ఉన్నావ్‌ గడ్డం తీసెయ్‌’ అంటూ హుకుం జారీ చేశారు. అతను నిరాకరించడంతో.. ‘నువ్‌ పాకిస్తానీవి. అందుకే అలా గడ్డం పెంచుకున్నావ్‌. పాకిస్తానివి కాకపోతే వెంటనే గడ్డం తీసేయ్‌’ అని దాడి చేశారు. అక్కడితో ఆగకుండా దగ్గర్లో ఉన్న సెలూన్‌ షాప్‌కు అతన్ని లాక్కెళ్లారు. అక్కడ గడ్డం గీయడానికి బార్బర్‌ నిరాకరించడంతో.. ఇద్దరినీ కొట్టారు. హమీద్‌ను కుర్చీకి కట్టేసి.. బలవంతంగా గడ్డం గీయించారు. బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామనీ, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.