గాలి జనార్దన్‌రెడ్డి కీ సీబీఐ విడుద‌ల‌

దిల్లీ: గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసు విచారణను సీబీఐ ప్రాథమిక దశలోనే సమాధి చేస్తోందా? అవుననే అంటున్నారు ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్‌. గోవాలోని రెండు పోర్టుల నుంచి గాలి జనార్దన్‌రెడ్డి ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారన్న లెక్కలను తాము తేల్చలేమని పేర్కొంటూ 2017 జూన్‌ 13వ తేదీన గోవా సీబీఐ (అవినీతి నిరోధక) విభాగం కర్ణాటక ప్రభుత్వానికి రాసిన మూడు పేజీల లేఖను ఆమె ట్విట్టర్‌ ద్వారా పోస్టు చేస్తూ ‘గాలి సోదరులపై ఉన్న మైనింగ్‌ కేసును సీబీఐ ఎలా సమాధి చేస్తోందో ఈ దస్తావేజులు చెబుతున్నాయి. మర్మ గోవా, పనాజీ పోర్టుల నుంచి అక్రమంగా ఎగుమతి చేసిన ఖనిజంలో గోవా, కర్ణాటకలకు చెందిన ఖనిజం ఎంతుందో వేరు చేసి చెప్పడం అసాధ్యం అని సీబీఐ చెబుతోంది’ అని ఆమె పేర్కొన్నారు. దేశంలోని 4 రాష్ట్రాల్లోని తొమ్మిది పోర్టుల నుంచి 12వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజం అక్రమంగా రవాణా అయిందన్నది అంచనా. ఇందులో గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన కంపెనీలు ఎంత మేర ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేశాయన్న లెక్కలు తేల్చాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం 2013లో సీబీఐకి లేఖ రాసింది. ‘చాలా మంది ఎగుమతిదారులు విదేశాలకు ఎగుమతి చేసే ముందు కర్ణాటక, గోవాలకు చెందిన ఖనిజాన్ని కలిపి ఎగుమతి చేస్తుంటారు. అందువల్ల అలా కలిపి ఎగుమతి చేసిన ఖనిజంలో కర్ణాటక, గోవాలది ఎంత ఉందన్న లెక్కలు తేల్చడం అసాధ్యం. 2006, 2011 మధ్యకాలంలో మర్మ గోవా, పనాజీల నుంచి ఎగుమతి అయిన ఖనిజంలో ఏ రాష్ట్రానిది ఎంత అన్న లెక్కలు పోర్టు అథారిటీ వద్ద కూడా లేవు. ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ధ్రువీకృత సమాచారం లేనప్పుడు దాన్ని నేరవిచారణకు పరిగణలోకి తీసుకోవడం వీలు కాదు. ఎంఎండీఆర్‌ చట్టం ప్రకారం ఎగుమతిదారులు అన్ని రకాల డాక్యుమెంట్లను తప్పనిసరిగా తమ దగ్గర ఉంచుకోవాలన్న నిబంధనేమీ లేదని న్యాయ నిపుణులు చెప్పారు. 2006 నుంచి 2011 వరకు మర్మ గోవా, పనాజీ పోర్టుల నుంచి కర్ణాటకకు చెందిన 16 పెద్ద కంపెనీలు 1,67,44,343 టన్నుల ఖనిజాన్ని ఎగుమతి చేశాయి. వాస్తవానికి 2,47,05,309 టన్నుల ఖనిజాన్ని గోవా నుంచి ఎగుమతి చేసుకోవడానికి ఈ 16 కంపెనీలకు కర్ణాటక డీఎంజీ అనుమతి ఇచ్చారు. వాస్తవంగా ఎగుమతి అయింది దీని కంటే చాలా తక్కువ’ అని గోవా సీబీఐ (ఏసీబీ) ఎస్పీ వి.అశోక్‌ కుమార్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే చెన్నై, మంగళూరు పోర్టులనుంచి జరిగిన అక్రమ ఎగుమతులపై విచారణ చేపట్టిన చెన్నై, బెంగుళూరు సీబీఐ శాఖలూ 2017 నవంబరు 8వ తేదీన ఇలాంటి లేఖలే కర్ణాటక ప్రభుత్వానికి రాశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 3 పోర్టుల నుంచి జరిగిన అక్రమ రవాణాపై ఇప్పటికీ సీబీఐ దర్యాప్తు జరుపుతున్నట్లు సీబీఐ పేర్కొంది. గోవా, బెంగుళూరు, చెన్నై బ్రాంచ్‌ సీబీఐ అధికారుల లేఖల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈకేసులను సీబీఐ విచారణ నుంచి ఉపసంహరింపజేసి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించినట్లు సమాచారం. అక్రమ మైనింగ్‌ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్‌ హెగ్డే ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతూ ‘ఖనిజం తవ్వకాల్లో చట్టాన్ని ఎలా ఉల్లంఘించిందీ మా నివేదికలో స్పష్టంగా చెప్పాం. అందుకు ఆధారమైన దస్తావేజులను అనుబంధంగా జతచేశాం. ఆ దస్తావేజులన్నింటినీ వ్యాపారుల కంప్యూటర్లు, ఆఫీసుల నుంచి సేకరించినవే. మైనింగ్‌కుగానీ, రవాణాకుగానీ, ఎగుమతికిగానీ అనుమతులు లేకుండానే వాళ్లు పెద్ద మొత్తంలో ఖనిజాన్ని ఎగుమతి చేసినట్లు మేం స్పష్టమైన ఆధారాలు చూపాం’ అని చెప్పారు.