గాలి సోమశేఖర్‌ రెడ్డి తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎందుకున్నారు?

సభకు రాని గాలి సోదరుడు..

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్ష జరగనుండగా ఇప్పుడు సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. అయితే భాజపా తరఫున పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన గాలి జనార్దన్‌ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌ రెడ్డి అసెంబ్లీకి హాజరుకాలేదు. ప్రమాణ స్వీకారం కోసం ప్రోటెం స్పీకర్‌ బోపయ్య గాలి సోమశేఖర్ రెడ్డి పేరు పిలవగా.. ఆయన సభలో కనిపించలేదు. దీంతో ఆయన సభకు ఎందుకు రాలేదు. ఎక్కడికి వెళ్లి ఉంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గాలి జనార్దన్‌ రెడ్డి తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని కాంగ్రెస్‌ ఆధారాలు చూపించిన సంగతి తెలిసిందే. సంపూర్ణ మెజార్టీ లేనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా అభ్యర్థి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆ పార్టీ నేడు బలాన్ని నిరూపించుకోనుంది.

ఆ ఎమ్మెల్యేలతో ఉన్నారా..?

ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్‌, ప్రతాప్‌ పాటిల్‌ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. వాళ్లు కూడా నేడు సభలో ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. దీంతో వీళ్లు భాజపాకు మద్దతిస్తున్నారా? అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా ఇప్పుడు సోమశేఖర్‌ రెడ్డి కూడా సభకు హాజరుకాకపోవడంతో మరో అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సోమశేఖర్‌ రెడ్డి కూడా ఆ ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఉండి ఉంటారని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ మాత్రం దీన్ని ఖండిస్తోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అందుబాటులో లేరని, కానీ వస్తే తమకే మద్దతిస్తారని చెప్తోంది.