గుర్రంకొండలో జోరుగా పాతనోట్ల వ్యాపారం

మండల కేంద్రమైన గుర్రంకొండలో పాత రూ.1000, రూ.500 నోట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. రద్దయిన పాతనోట్లు రూ.లక్ష ఇస్తే ప్రస్తుతం చెలామణిలో ఉన్న కొత్త నోట్లు రూ.10 వేలు ఇస్తున్నారు. బడా వ్యాపారులు స్థానికంగా కొంత మంది ఏజెంట్లను నియమించుకొని నోట్ల వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ సేకరించిన పాతనోట్లను ఏజెంట్ల ద్వారా కర్ణాటకలోని పలు ముఖ్య పట్టణాలకు తరలిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన విసయం తెలిసిందే. పాతనోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకునేందుకు కొంత గడువు ఇచ్చింది. చాలామంది తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు.

ఈ నేపథ్యంలో మార్చుకోకుండా అలాగే ఉన్న పాతనోట్లను గుట్టుచప్పుడు కాకుండా సేకరిస్తూ వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది స్థానికులు ఏజెంట్లగా మారి పాతనోట్లను తమకిస్తే రూ.500 పాత నోటుకు రూ.50, రూ.1000 నోటుకు రూ.100 ఇస్తున్నారు. పట్టణంలోని కడప–బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపూలా ఉన్న చిన్న చిన్న దుకాణాల వద్ద ఏజెంట్లు మకాం వేస్తున్నారు. ప్రజల వద్ద నుంచి గట్టుచప్పడు కాకుండా పాతనోట్లను కమీషన్‌ పద్ధతిపై సేకరిస్తున్నారు. వాటిని బెంగళూరుతో పాటు పలు పట్ణణాలకు ప్రైవేట్‌ బస్సుల ద్వారా తరలిస్తున్నారు.

దీనివెనుక ఆంతర్యమేమిటి?
రెండేళ్ల క్రితం రద్దు చేసిన పాతనోట్లను ఇప్పుడు సేకరించడం వెనక ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏజెంట్లు రహస్యంగా పాత నోట్లను సేకరించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇక్కడ సేకరించే పాతనోట్లు కర్ణాటకా తరలించడం వెనుక మర్మమేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.