గేమ్‌ షోలో పరువు పాయె!

గేమ్‌ షోలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పరువు పోగోట్టుకున్న యువతి.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. టర్కీష్‌ టీవీ షో హూ వాంట్స్‌ టూ బీ ఏ మిలీనియర్‌(కౌన్‌ బనేగా కరోడ్‌పతి షో తరహా)లో పాల్గొన్న సు ఐహాన్‌(26) ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా ఎక్కడుంది? అన్న ప్రశ్న కోసం చాలా కష్టపడింది. హోస్ట్‌ ఇచ్చిన సమాధానాల్లో చైనా, ఇండియా, దక్షిణ కొరియా, జపాన్‌లు ఉన్నాయి. అయితే తనకు ఆన్సర్‌ తెలుసన్న ఐహాన్‌, కన్ఫర్మేషన్‌ కోసం ఆడియన్స్‌ పోల్‌ను ఆశ్రయించింది.

ఆడియన్స్‌లో 51 శాతం మంది చైనా అని ఆన్సర్‌ చెప్పగా.. నాలిగింట ఒక వంతు ‘ఇండియా’ అని సమాధానం ఇవ్వటం కొసమెరుపు. అయితే ఆడియన్స్‌ తీర్పుపై అనుమానంతో ‘ఫోన్‌ ఏ ఫ్రెండ్‌ లైఫ్‌ లైన్‌’ను కూడా ఆ యువతి ఆశ్రయించింది. చివరకు ఫ్రెండ్‌ ద్వారా సమాధానం ‘చైనా’ అని ధృవీకరించుకుని అప్పుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాతి ప్రశ్నకే ఐహాన్‌ గేమ్‌ నుంచి అవుటయ్యింది. ఓ పాపులర్‌ పాటకు కంపోజర్‌ ఎవరన్న ప్రశ్నకు తడబడి తప్పు సమాధానంతో షో నుంచి నిష్క్రమించింది.

అక్కడి నుంచే అసలు వ్యవహారం మొదలైంది. ఎక్‌నామిక్స్‌లో గ్రాడ్యూయేట్‌ అయిన ఆ యువతిని సోషల్‌ మీడియాలో పలువురు ట్రోల్‌ చేసి పడేస్తున్నారు. ‘నీ ప్రశ్నలో సమాధానం ఉన్నా నీకు ఆన్సర్‌ తెలీకపోవటం సిగ్గు చేటని కొందరు. నీ చదువు మొత్తం వృథా అని ఇంకొందరు. నువ్వు డ్రాప్‌ అయి ఉంటే నీ ప్లేస్‌లో ఇంకొకరు వెళ్లేవారంటూ… ఇలా ఆ యువతిని ఏకీ పడేస్తున్నారు. అయితే ఆ యువతి మాత్రం విమర్శలను పట్టించుకోకుండా.. దక్కిన సెలబ్రిటీ హోదాను ఎంజాయ్‌ చేస్తానంటోంది ఐహాన్‌.