గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌ చేసుకున్నారు వకార్‌

ఆసియాకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఒత్తిడికి గురై చిత్తు కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ వకార్‌ యూనిస్‌ పేర్కొన్నాడు. ఇక్కడ టీమిండియా ఒత్తిడిలోకి వెళుతుందని అనుకుంటే, పాకిస్తాన్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడం తనకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందన్నాడు. ‘ టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టే చాన్స్‌లను పాకిస్తాన్‌ కోల్పోయింది.

గత కొంతకాలంగా యూఏఈ అనేది పాకిస్తాన్‌కు సొంత వేదికగా ఉంది. అదే సమయంలో దుబాయ్‌లో విపరీతమైన వేడి వాతావరణం మధ్య భారత్‌ ఎక్కువగా మ్యాచ్‌లు కూడా ఆడలేదు. సుదీర్ఘమైన ఇంగ్లండ్‌ పర‍్యటన అనంతరం భారత్‌కు ఇక్కడకు వచ్చింది. పాక్‌తో మ్యాచ్‌కు ముందు రోజు హాంకాంగ్‌పై భారత్‌ చెమటోడ్చి గెలిచింది. ఇవన్నీ పాక్‌కు అనుకూలంగా మారతాయని అనుకున్నా. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. మొత్తంగా తమ జట్టే చిత్తుగా ఓడిపోయింది. ఎటువంటి పోరాటం చేయకుండానే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక గోల్డెన్‌ చాన్స్‌ను పాకిస్తాన్‌ కోల్పోయింది. నా వరకూ అయితే భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య చివరిగా జరిగిన రసవత్తరమైన మ్యాచ్‌ ఏదైనా ఉందంటే, అది 2011లో మొహాలీలో జరిగిన వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచే’ అని వకార్‌ తెలిపాడు.