గౌస్‌.. పచ్చిమాంసం పీక్కుతింటాడు

పాతబస్తీ పురానీహవేలీలోని హెచ్‌ఈహెచ్‌ నిజాం మ్యూజియం నుంచి పురాతన, నిజాంకు చెందిన పసిడి వస్తువులైన 1950 గ్రాముల టిఫిన్‌ బాక్స్, కప్పు–సాసర్, స్ఫూన్‌ దొంగతనం చేసిన దొంగలు పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు. రెక్కీ, చోరీ, ఎలిబీల్లోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులైన గౌస్‌ పాషా, మొబిన్‌ల విచారణలో వెలుగులోకి వస్తున్న వివరాలతో పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నిందితుల్నే సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఈ కేసును కొలిక్కి తేవడానికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పక్కా హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ వాడామని కొత్వాల్‌ అంజనీ కుమార్‌ ప్రకటించారు.

క్రైమ్‌ సీన్‌ చూసి ప్రాథమిక అంచనా…
మ్యూజియంలో చోరీ విషయం ఈ నెల 4 ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు ఘటనాస్థలిని అధ్యయనం చేశారు. రెక్కీ తర్వాత వేసుకున్న మార్కింగ్స్‌ తీరును బట్టి నిర్మాణ రంగంలో పని చేసే వారి ప్రమేయం అనుమానించారు. ప్రధానంగా తాపీ పని లేదా సెంట్రింగ్‌ పని చేసే వాళ్లే నిందితులని భావించారు. మరోపక్క వెంటిలేటర్‌ నుంచి లోపలకు దిగడంతో అది కాస్త సన్నగా ఉన్న వ్యక్తికే సాధ్యమని నిర్థారించారు. సీసీ కెమెరాల్లో చిక్కిన విజువల్స్‌లోని అనుమానితుల్లో ఓ సన్నగా ఉన్న వ్యక్తి కూడా ఉండటం ఈ అనుమానానికి బలాన్నిచ్చింది. వీటితో పాటు సాంకేతిక ఆధారాలతో పోలీసులు ముందుకు వెళ్ళారు. నిందితుడు గౌస్‌ నేరానికి వస్తూ తన సిమ్‌కార్డును ఇంట్లోనే వదిలేసి కేవలం సెల్‌ పట్టుకుని వచ్చి టార్చ్‌గా వాడాడు. సీసీ కెమెరా ముందు మాత్రం ఆ సెల్‌తో మాట్లాడుతున్నట్లు నటించి పోలీసుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు.

గంట పాటు అక్కడే తిరిగారు…
మ్యూజియంకు మొత్తం మూడు వైపుల నుంచి వచ్చే అవకాశం ఉన్నా.. అవన్నీ వదిలిన నేరగాళ్ళు వెనుక మార్గం ఎంచుకున్నారు. మ్యూజియం పైకి ప్రవేశిస్తూనే మాస్క్‌లు, గ్లౌజ్‌లు వేసుకుని వేలిముద్రలు పడకుండా, కవళికలు రికార్డు కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. నేరం చేసిన తర్వాత సైతం దాదాపు గంట పాటు ద్విచక్ర వాహనంపై మ్యూజియం చుట్టుపక్కలే తిరిగి గంగానాల, ముర్గీచౌక్‌ మీదుగా ముంబై హైవే వైపు వెళ్లారు. దీంతో పోలీసులు తాము ముంబై వెళ్లిపోయినట్లు భావిస్తారని ఇలా చేసి… ముత్తంగి వద్ద ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ పట్టుకుని సిటీకి వచ్చారు. పోలీసులు టోల్‌గేట్స్‌ పరిశీలించిన తర్వాత కూడా తప్పుదారి పట్టేలా ఇలా చేశారు. రెండో రోజూ జహీరాబాద్‌ వరకు వాహనంపై వెళ్లిన వీరు అక్కడ నుంచి బస్సులో ముంబై చేరుకుని బేరసారాలు చేశారు.

ఎలిబీ కోసం అరెస్టుకు యత్నం…
పురాతన వస్తువులు విక్రయించడానికి బేరం కుదరకపోవడంతో తిరిగి వచ్చిన తర్వాత గౌస్‌ ఎలిబీ (నేరం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్లు నిరూపణకు) కోసం మరో పథకం వేశాడు. 2011 నుంచి 25 నేరాలు చేసిన ఇతడిపై 14 నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఏదో ఒక ఠాణా నుంచి ఒక దాన్ని ఎగ్జిక్యూట్‌ చేయించుకుని జైలుకు వెళ్లాలని భావించాడు. అలా చేస్తే పోలీసుల దృష్టి తనపై పడదనే ఈ పథకం వేశాడు. ఇదిలా ఉండగా… ఈ కేసును ఛేదించేందుకు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్సైలు కేఎన్‌ ప్రసాద్‌ వర్మ, జి.వెంకటరామిరెడ్డి, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థక్రుద్దీన్‌లు ‘పని విభజన’ చేసుకున్నారు.

వేగులకు పని చెప్పడంతో…
ఓపక్క సీసీ కెమెరాలు, కాల్‌ డిటేల్స్‌ వంటి సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూనే మరోపక్క హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ను వాడుతూ వేగులకు పని చెప్పారు. నేరం జరగడానికి ముందు రోజు, ఆ తర్వాత నగరం నుంచి జారీ అయిన ఈ–చలాన్‌ల డేటాబేస్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీలో వాహనంపై సంచరిస్తున్న, నేరం చేసినప్పటి దుస్తులే ధరించిన అనుమానితులు చిక్కారు. దీని ఆధారంగా వారి వాహనం నెంబర్‌ సేకరించి చిరునామా గుర్తించే పనిలో పడ్డారు. ఈలోపు ‘సెంట్రింగ్‌ పని వృత్తిగా ఉన్న’ దొంగ గౌస్‌ కొన్ని రోజులుగా కనిపించట్లేదని వేగుల ద్వారా సమాచారం అందింది. మార్కింగ్స్‌ ఇచ్చిన క్లూ.. ఇక్కడ సెంట్రింగ్‌ పని వృత్తి… సరిపోలడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లి గౌస్‌తో పాటు మొబిన్‌ను పట్టుకున్నారు.

గౌస్‌.. పచ్చిమాంసం పీక్కుతింటాడు
నిందితుడు గౌస్‌కు ఖూనీ గౌస్‌ అనే మారు పేరు కూడా ఉంది. ఇతడు పచ్చి మాంసాన్ని పీక్కు తింటాడనే ఆ పేరు వచ్చింది. దేశంలో జరిగిన మ్యూజియం నేరాల్లో ఇదే అతిపెద్దది. ప్యారిస్‌ మ్యూజియం, యూరప్‌ వెన్‌గావ్‌ మ్యూజియం, బోస్టన్‌ మ్యూజియంలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పురావస్తు ప్రదర్శన శాలల్లో జరిగిన నేరాలు కూడా ఇంత త్వరగా కొలిక్కిరాలేదు. వీటిలో కొన్ని కేసుల్లో ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్స్‌ దర్యాప్తు చేసినా 100 శాతం రికవరీ లేదు. అయితే నిజాం మ్యూజియం కేసును తక్కువ కాలంలో ఛేదించి, పూర్తి రికవరీ చేశాం. నగరంలో ఉన్న అనేక మ్యూజియంల భద్రత పెంచాలని నిర్వాహకుల్ని కోరతాం. అవసరమైతే వారి సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ సైతం ఇస్తాం.