చంద్రబాబు పార్టీలోకి చేరిపోయారా..!

వీళ్లంతా మాస్కులు వేసుకునే వస్తున్నారు.. చంద్రబాబు పార్టీలోకి చేరిపోయి బాబును పొగిడితే, అదంతా టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. అదే వేరే పార్టీ, వేరే సంస్థ అనో ఏర్పరుచుకుని అక్కడ నుంచి బాబును పొగిడితే బాబుకు కావాల్సినంత మైలేజీ. తటస్థులను బాగా ప్రభావితం చేయవచ్చు అనేది వీరి లెక్క.

అందుకోసమే తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగాల్లాగా పలు పార్టీలు సహాయ సంస్థలుగా పని చేస్తున్నాయనేది బహిరంగ రహస్యం. వీళ్లు అప్పుడప్పుడు చంద్రబాబును విమర్శిస్తారు. అవసరమైనప్పుడు మాత్రం బాబును ప్రశంసిస్తారు. అదీ కథ. ఈ తానులో ముక్కే మాజీ ఐపీఎస్ వి.లక్ష్మినారాయణ కూడా, అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు.

ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి జనాల మధ్యకు వచ్చిన లక్ష్మినారాయణ అక్కడకు వెళ్లి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకపోవడం విడ్డూరం. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే.. జనాల్లోకి వెళ్లినట్టా? అనే ప్రశ్నను వేయవచ్చు ఇక్కడ. ప్రభుత్వాన్ని విమర్శించే అవసరమే లేకపోతే, జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? అనే బేసిక్ లాజిక్‌ను పరిగణనలోకి తీసుకోవాలిక్కడ.

శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లిన లక్ష్మినారాయణతో ప్రభుత్వ తీరును గురించి ప్రశ్నిస్తే, బాగా చేస్తోంది అన్నారట. విధానాలన్నీ బాగున్నాయని చెప్పాడట. మరి అంత బాగున్నప్పుడు వీఆర్ఎస్ తీసుకుని వచ్చి రాజకీయాల్లోకి ఎందుకు? అని లక్ష్మినారాయణ తనను తాను ప్రశ్నించుకోవాలి. ఇక వారసత్వ రాజకీయాలను మాత్రం ఈయన తప్పుపట్టాడు. తన వారసుడిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మరీ మంత్రి పదవిని ఇచ్చిన చంద్రబాబుకు ఈ మాటలు తగులుతాయని అనుకోవాలా? వెనుకటికి జగన్ సీఎం కావాలనుకుంటే అది రాజరికం, లోకేష్ చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చుకుంటే మాత్రం అది పుత్రప్రేమ అన్నట్టుగా మాట్లాడాడు పవన్ కల్యాణ్.

ఇప్పుడు అలాంటి పవన్ కల్యాణ్ లోటు తెలుగుదేశం పార్టీకి కనిపిస్తోంది. బయట ఉండి తమకు మర్దన చేసే వాళ్లు, తమ తరఫున మద్దెల కొట్టేవాళ్లు టీడీపీకి అవసరం. ఆ బాధ్యతను ప్రస్తుతానికి లక్ష్మినారాయణకు ఇచ్చినట్టే అని, కొంత సమయం అయ్యాకా ఆయన అధికారికంగా టీడీపీలోకి చేరడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.