చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు

హైదరాబాద్‌ : మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. గత నెల రోజుల్లో గుంటూరు జిల్లాలో 20 అత్యాచారాలు జరిగాయని, రాజధాని ప్రాంతంలో అత్యాచార ఘటనలు జరగడం సిగ్గు చేటన్నారు.

విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌కు టీడీపీ పెద్ద తలకాయల అండదండలు ఇస్తే చంద్రబాబు మద్దతు తెలిపారని, అందుకే ఇప్పుడు రాష్ట్రంలో మగాళ్లు మృగాళ్లుగా మారి పసిపిల్లలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆ రోజే టీడీపీ నాయకులపై చర్యలు తీసుకుని ఉండే ఈ రోజు రేప్‌ సంఘటనలు జరిగేవి కావన్నారు. మైనర్లపై అత్యాచారాలు జరిగితే టీడీపీ నేతలు వాటిని సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబే స్వయంగా ఈ సెటిల్‌మెంట్లను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో చంద్రబాబు అవనీతిపై కానిస్టేబుల్‌తో విచారణ జరిపించినా జైలు కెళ్తారని అన్నారు. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ చంద్రబాబుకు ప్రజాసమస్యలపై లేదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ సమావేశాలు అన్ని భూ సంతర్పణల కోసమే జరిగాయని అన్నారు. నెల్లూరులో ఎకరాను మూడు లక్షలకు ప్రభుత్వం కేటాయింపులు చేయడంపై పద్మ ఫైర్‌ అయ్యారు. ఇప్పటివరకూ కేబినేట్‌ భేటీల్లో పేదలకు, మహిళలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా? అని ప్రశ్నించారు.