చంద్రబాబు పుట్టినరోజున అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు

అనంతపురం జిల్లా తెలుగుదేశంపార్టీలో విభేదాలు మరోసారి స్పష్టంగా కనిపించాయి. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎవరికి వారుగా ఉపవాస దీక్షలు చేయడం సంచలనం కలిగించింది. అసలు అనంత టీడీపీలో ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకోండి!

అనంతపురం జిల్లా తెలుగుదేశంపార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేశారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు ఉపవాసదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలలో నేతల మధ్య కుమ్ములాటలు బయటపడ్డాయి. అనంతపురం నగరంలో క్లాక్‌టవర్‌ దగ్గర మంత్రుల ఆధ్వర్యంలో ఉపవాసదీక్ష జరిగింది. దీనికి పోటీగా మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా ఇంటి దగ్గర ఆయన కుమారుడు జకీవుల్లా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఎంపీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. వందలాది మంది మహిళలు.. పార్టీ నాయకులు.. కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. అనంతపురంలో తన వర్గాన్ని పెంచుకోవడానికి పవన్‌కుమార్‌రెడ్డి ఇప్పటి నుంచే వ్యూహాలు రచించుకుంటున్నట్టు తెలుస్తోంది. సైఫుల్లా వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలోపడినట్టు సమాచారం. పార్టీలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జకీవుల్లాకు నగరంలో గట్టి పట్టు ఉంది. బలహీనంగా ఉన్న జేసీ వర్గం జకీవుల్లాకు దగ్గర కావడంతో నగరంలో బలపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వచ్చే రెండు నెలలలో పవన్‌ నగరంలోని అన్ని వార్డులను పర్యటించే అవకాశం ఉంది.

అనంతపురం నగరంలో ఓ ఇంటిని నిర్మించుకుంటున్న పవన్‌.. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడి నుంచే కార్యక్రమాలను నడపాలని అనుకుంటున్నారు. ఇక కదిరిలో కూడా ఎమ్మెల్యే చాంద్‌బాష ఒకవైపు … మాజీ ఎమ్మెల్యే కందికుంట మరోవైపు ఉపవాసదీక్షలో పాల్గొన్నారు. అలాగే పలు నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు జరుపుకోవడాన్ని కార్యకర్తలు తప్పుపడుతున్నారు.