చావోరేవో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌

సన్‌రైజర్స్‌తో బెంగళూరు పోరు నేడు

బరిలో 2 జట్లు. 22 మంది ఆటగాళ్లు. రెండు జట్ల మధ్య పోరాటం. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య సమరం. కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ నేపథ్యంలో ఇవేవీ చర్చకు లేవు! అందరి దృష్టి ఒక్కడిపైనే. అతడి ఆటపైనే. అతడిని ప్రత్యక్షంగా చూసేందుకు 38 వేల మంది ఇప్పటికే సిద్ధమయ్యారు. లెక్కలేనంత మంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. ఇక సోమవారం దారులన్నీ ఉప్పల్‌ స్టేడియంవైపే. అందరి ఆలోచనలు స్టేడియం చుట్టే. హైదరాబాద్‌ను తన అభిమానం గుప్పిట్లో బంధించిన ఆ ఆటగాడే.. ప్రపంచ క్రికెట్‌ మేటి, టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లి. అతడి వన్‌ మ్యాన్‌ షో నేడే.

సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇటు సన్‌రైజర్స్‌.. అటు బెంగళూరుకు ముఖ్యమైన మ్యాచ్‌కు వేదిక ముస్తాబైంది. ఒక్క విజయం సాధిస్తే సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌కు మరింత చేరువైనట్లే! ఒక్క ఓటమి ఎదురైనా బెంగళూరుకు ప్లేఆఫ్‌ దూరమైనట్లే! చావోరేవో మ్యాచ్‌లో బెంగళూరు, ఆ జట్టు కెప్టెన్‌ కోహ్లి ఏం చేస్తారన్నది ఆసక్తికరం. ఇక వరుసగా నాలుగో విజయంతో ఎదురులేకుండా ఉన్న సన్‌రైజర్స్‌ ఐదో గెలుపుపై కన్నేసింది. బౌలింగే ప్రధానాయుధంగా ప్రత్యర్థుల్ని చిత్తుచేస్తున్న సన్‌రైజర్స్‌.. బెంగళూరుపైనా అదే అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమేదైనా చేస్తాడా? సన్‌రైజర్స్‌ బౌలింగ్‌పై బెంగళూరు బ్యాటింగ్‌ ఆధిపత్యం చలాయిస్తుందా? అన్నది చూడాలి.
గాడినపడ్డ బ్యాటింగ్‌: 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 2 ఓటములతో 14 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్‌ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్‌ బెర్తు దాదాపుగా ఖాయమైనట్లే! ఇక వరుసగా ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ను గట్టెక్కించిన ఘనత పూర్తిగా బౌలర్లదే. పరుగుల వరద పారే ఐపీఎల్‌లో 118, 132, 151 పరుగుల్ని కాపాడుకోవడం గొప్ప విషయమే. బౌలింగ్‌ వనరుల్ని సమర్థంగా వినియోగించుకుంటున్న ఘనత సన్‌రైజర్స్‌దే. ఆ జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌, కోచ్‌ టామ్‌ మూడీలదే. పదునైన పేస్‌కు.. నాణ్యమైన స్పిన్నర్లు జతకలవడంతో ప్రత్యర్థి జట్లు బెంభేలెత్తిపోతున్నాయి. భువనేశ్వర్‌కుమార్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌శర్మ.. స్పిన్నర్లు రషీద్‌ఖాన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రతి బౌలర్‌ భిన్నంగా బంతులు సంధిస్తూ బ్యాట్స్‌మెన్‌ను అయోమయానికి గురిచేస్తున్నారు. మరోవైపు కెప్టెన్‌ విలియమ్సన్‌ బౌలర్లను రొటేట్‌ చేస్తున్న విధానం కూడా ఆసక్తికరమే. భువనేశ్వర్‌తో సహా ఏ ఒక్క బౌలర్‌తో వరుసగా రెండు ఓవర్లు వేయించట్లేదు. వికెట్‌ తీసినప్పుడు లేదా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఒక బౌలర్‌ వరుసగా రెండో ఓవర్‌ వేస్తుండటం గమనార్హం. తరచూ బౌలింగ్‌ మార్పులు చేస్తుండటంతో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ అయోమయానికి గురవుతున్నాడు. ఈ వ్యూహం సన్‌రైజర్స్‌కు మంచి ఫలితాల్ని ఇస్తోంది. వరుసగా ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌, దిల్లీలపై విజయాలే ఇందుకు నిదర్శనం. ఇక శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ గాడినపడటం సన్‌రైజర్స్‌కు సానుకూలాంశం. 164 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఛేదిస్తుందో లేదోనన్న అనుమానాల్ని బ్యాట్స్‌మెన్‌ పటాపంచలు చేశారు. ఓపెనర్లు మొదలుకొని మిడిలార్డర్‌ వరకు ప్రతి ఒక్కరు ఓ చేయి వేసి జట్టుకు విజయాన్ని అందించారు. డేవిడ్‌ వార్నర్‌ లోటు తీరుస్తాడనుకున్న అలెక్స్‌ హేల్స్‌ జట్టు నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హేల్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఆఖరి వరకు సాగిన దిల్లీ మ్యాచ్‌లోనూ అతనాడిన 45 పరుగుల ఇన్నింగ్సే కీలకమైంది. శిఖర్‌ ధావన్‌, విలియమ్సన్‌, మనీష్‌ పాండేలు ఫర్వాలేదనిపించారు. చివర్లో యూసుఫ్‌ పఠాన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ సన్‌రైజర్స్‌కు కలిసొచ్చింది. పఠాన్‌ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. మొత్తంగా బౌలింగ్‌తో అద్భుతాలు చేస్తన్న సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్‌కు ముందు బ్యాట్స్‌మెన్‌ అంతా ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం.

కోహ్లి, ఏబీలపైనే భారం: 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు.. 6 పరాజయాలు మూటగట్టుకున్న బెంగళూరు పరిస్థితి ఏమంత బాగాలేదు. ప్రస్తుతం 6 పాయింట్లతో ఉన్న బెంగళూరు.. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తర్వాతి ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాల్సిందే. అప్పుడు కూడా మిగతా జట్ల సమీకరణాలపై ప్లేఆఫ్‌ అవకాశాలు ఆధారపడి ఉంటాయి!. ఐతే రేసులో నిలవాలంటే బెంగళూరుకు ప్రతి మ్యాచ్‌ కీలకమే. ఈనేపథ్యంలో కోహ్లి, డివిలియర్స్‌లపైనే బెంగళూరు భారం మోపనుంది. మొదట్నుంచి బెంగళూరు తరఫున నిలకడగా ఆడుతుంది కోహ్లి మాత్రమే. 9 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 357 పరుగులు రాబట్టాడు. డిలివియర్స్‌ 7 మ్యాచ్‌ల్లో 46.83 సగటుతో 281 పరుగులు చేశాడు. మన్‌దీప్‌సింగ్‌ (211) ఫర్వాలేదనిపిస్తున్నా.. అతని ఖాతాలో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు లేవు. మెక్‌కలమ్‌ ఘోరంగా విఫలమయ్యాడు. మరోవైపు బెంగళూరుకు బౌలింగ్‌ కూర్పు కూడా కుదరడం లేదు. ఉమేశ్‌యాదవ్‌ వికెట్లు తీస్తున్నా.. భారీగా పరుగులిస్తున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌దీ అదే పరిస్థితి. బౌలింగ్‌లో చాహల్‌పై అతిగా ఆధారపడటం బెంగళూరు కొంపముంచింది. అతను 9 మ్యాచ్‌ల్లో తీసింది 7 వికెట్లే. చాహల్‌కు మద్దతుగా మరో నాణ్యమైన స్పిన్నర్‌ లేకపోవడంతో అతను పరుగులివ్వకుండా అడ్డుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ ప్రతికూలతల నడుమ కోహ్లి జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.