జగన్ ది దొంగ పాదయాత్ర అంటున్న: పరిటాల సునీత

దొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని దోచేయడం ఖాయమని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండల కేంద్రమైన గార్లదిన్నెలో ఆదివారం శింగనమల నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్‌ యామినీబాల, జడ్పీ చైర్మన్‌ పూలనాగరాజు, ఎమ్మెల్సీలు శమంతకమణి, కేఈ ప్రభాకర్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, పరిశీలకుడు ముక్తియార్‌ తదితరులు హాజరయ్యారు. మినీ మహానాడు ర్యాలీలో మంత్రి కాలవ శ్రీనివాసులు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. అధికార దాహంతో జగన్‌ లేనిపోని హామీలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ యన మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే పూర్తిగా దోచేస్తారన్నారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న ఎందరో మహానుభావులను కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఈ బాధలు కాంగ్రెస్‌ హయాంలో అనుభవించామని గుర్తుచేశారు.

రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరించకపోగా అన్ని రకాలుగా అడ్డుపడుతున్నా ఏపీని అభివృద్ధి పథంలో సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారన్నారు. కుల, మత రా జకీయాలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులకు న్యాయం చేస్తున్నారన్నారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కై సీఎం చంద్రబాబు సుభిక్షపాలనను భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. బీజేపీకి కర్ణాటక ఎన్నికలే గుణపాఠమన్నారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి సీఎంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ప్రభుత్వ విప్‌ యామినీబాల మాట్లాడుతూ… కరువు జిల్లా అనంత రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి 38టీఎంసీల నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చారని, ఆ నీటితో చెరువులు కళకళలాడుతున్నాయన్నారు. జిల్లాలో అతిపెద్దదైన శింగనమల చెరువుకు నీరు విడుదల చేయడంతో రైతు సోదరులు పంటలు సాగుచేస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ చెరువుకింద 18వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కోటంక, మర్తాడు చెరువులకు లిఫ్ట్‌ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గార్లదిన్నెలోని 24 గ్రామాల శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పంచాయతీరాజ్‌ నిధులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చే పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. మోదీ అహంకారానికి కర్ణాటక ఎన్నికలు గుణపాఠం చెప్పాయన్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులుఎన్ని ఉన్నా.. హామీలు నెరవేరుస్తున్న ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు.

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు. పార్టీకోసం కష్టపడేవారిని ఎన్నటికీ మరచిపోమని స్పష్టం శారు. జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు మాట్లాడుతూ… తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా టీడీపీ ఆదుకుంటుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు మాట్లాడుతూ.. పండ్లతోటల అభివృద్ధికోసం జిల్లాకు రూ.12 కోట్లు కేటాయిస్తే.. అందులో రూ.10 కోట్లు శింగనమల నియోజకవర్గానికే తీసుకువచ్చారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు ముక్తియార్‌ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లూ ఎంతో కష్టపడుతున్నారన్నారు. ఎవరెన్ని చేసినా 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు ముంటిమడుగు కేశవరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, భోగాతినారాయణరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు జెన్నె నాగరాజు, అమృత, శాలిని, అరుణ, విశాలాక్షి, ఆలం శిరీషా, అరుణ, రామలింగారెడ్డి, ఆలం వెంకట నరసానాయుడు చంద్రశేఖర్‌ నాయుడు, కోనారెడ్డి, గేట్‌ క్రిష్ణారెడ్డి, మండల కన్వీనర్‌ జయరాం,అశోక్‌, బాలరంగయ్య, గోవర్దన్‌, శివయ్య, గుత్తా ఆదినారాయణ, గుర్రం ఆదినారాయణ, ఇల్లూరు రామాంజనేయులు, గుత్తా బాలక్రిష్ణ, వడ్డె వన్నూర్‌, పాండు, గుర్రం శ్రీనివాసులు, వడ్లరాము, పుల్లన్న, సుంకన్న, ఆవుల క్రిష్ట, రామచంద్రారెడ్డి, చితంబరిదొర, డేగల క్రిష్ణమూర్తి, చౌదరి, కిష్టయ్య, చితంబరప్ప తదితరులు పాల్గొన్నారు.