జయలలితకు జరిమానా… రూ.100 కోట్లు

అక్రమాస్తుల కేసులో జరిమానా వసూలుకు చర్యలు..

అక్రమాస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రూ.100 కోట్లు జరిమానా విధించిన నేపథ్యంలో వసూలు చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా 1991-96 మధ్య ఉన్నప్పుడు ఆదాయానికి మించిన రూ.66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. జయలలిత నిచ్చెలి శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా ఈ అక్రమాస్తుల వ్యవహారంలో సంబంధం ఉందంటూ కేసు నమోదైంది. సుమారు 20 సంవత్సరాలపాటు విచారణ జరిగిన ఈ కేసులో 2017 ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ నలుగురూ అక్రమాస్తులను కూడబెట్టినట్లు సుప్రీంకోర్టు నిర్ధరించింది. జయలలిత 2016లోనే మృతి చెందటంతో ఆమెకు రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు తలా నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017లో కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో జయలలితకు విధించిన రూ.100 కోట్ల జరిమానాను వసూలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నిందితులైన నలుగురి ఆస్తులను స్వాధీనం చేసుకునే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మొదటి విడతగా వారికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏఏ ఆస్తులు ఉన్నాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరునెల్వేలి, తంజావూరు, నీలగిరి మొదలగు ప్రాంతాల్లో నలుగురికి అనేక ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అందులో 128 ఆస్తులను ఇంతకు ముందే ప్రభుత్వం స్తంభింపజేసింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ల ద్వారా ఆరు నకిలీ సంస్థల్లో అక్రమంగా పెట్టుబడి పెట్టినట్లు చూపడంతో వాటి పేరిట ఉన్న 68 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఇప్పుడు ఆ ఆస్తులను అధికారులు పరిశీలించారు. త్వరలో జయలలితకు విధించిన జరిమానా వసూలుకు వీటిని ఏ మేరకు స్వాధీనం చేసుకోవాలనే అంశాన్ని తేల్చనున్నారు.