జీవితాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు త్యాగం చేసిన వ్య‌క్తియిన‌..

ఫిలిం ఛాంబర్‌లో మాట్లాడీన బాలకృష్ణ :

మనందరి గుండెల్లో దాసరి చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అందరం కలిసికట్టుగా ఆయన ఆదర్శాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… ‘‘కాకతాళీయమో.. యాదృశ్చికమో కానీ దాసరి దర్శకత్వంలో ఆయన 150వ చిత్రం ‘పరమవీరచక్ర’లో నటించా. అంతకుముందు ఆయన ఎన్ని సినిమాలు చేశారో అన్ని సినిమాల ఆనందం, అనుభూతి ఆ సినిమా ద్వారా నాకు కలిగింది. ‘శివరంజని’ సినిమాకు నన్ను కథానాయకుడి పెట్టి తీస్తామన్నారు. ‘బాబు చదువుకుంటున్నాడు చదువు పూర్తయిన తర్వాత చేద్దాంలే’ అని నాన్న చెప్పడంతో ఆగిపోయారు. ఆ కోరిక ఆయన 150వ చిత్రం ద్వారా తీరింది. ఆ సినిమాతో ఆయన పేరు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చేరింది. 152 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, నంది అవార్డులు ఎన్నో వచ్చాయి. కానీ, ఆ అవార్డులన్నీ ఆయన ముందు దిగదుడుపే. ఆయన జీవితంలో సంపాదించుకుంది ఏదైనా ఉందంటే అది మనందరి గుండెల్లో చెరగని ముద్ర. మృదు స్వభావి.. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు మాడ్లాడే వారు. ఎంతో మంది దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు. ‘తాత మనవడు’, ‘తూర్పు పడమర’, ‘మనుషులంతా ఒక్కటే’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలి పులి’, ‘ఒసేయ్‌ రాములమ్మా!’ వంటి గొప్ప సందేశాత్మక చిత్రాలు తీశారు. మధ్యతరగతి కుటుంబం పడే అవస్థలను ఆయన సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపించేవారు. దర్శకుడిగా, కథా రచయితగా, కార్మికుడిగానే కాకుండా చలన చిత్రపరిశ్రమలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ముందుండి పరిష్కరించే వారు. ఆయన జీవితాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోసం త్యాగం చేశారు. క్రమశిక్షణ, సేవా దృక్పథం, మంచితనం ఇవన్నీ కలిపితే నిండుకుండ దాసరి. ఏ ఆదర్శాల కోసం దాసరి పోరాడారో.. వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంటిలో అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా.. కంట్లో నలక ఉంటే కనుగుడ్లు పీకేయాలా? అన్నట్లుగా కాకుండా అందరం కలిసికట్టుగా ఆయన ఏ ఆదర్శాల కోసం బతికారో ఆయన స్ఫూర్తితో మనందరం కలిసుండి చలనచిత్ర పరిశ్రమను మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లేలా ముందుకెళ్దాం. ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫిలిం ఛాంబర్‌ కమిటీని అభినందిస్తున్నా’’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, దాసరి అరుణ్‌, సినీ నిర్మాతలు అల్లు అరవింద్‌, డి.సురేష్‌బాబు, సి.కల్యాణ్‌, సినీనటులు కృష్ణ, విజయనిర్మల, మురళీమోహన్‌, రేలంగి నర్సింహారావు, దర్శకులు వి.వి.వినాయక్‌, ఎన్‌.శంకర్‌, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్యతో పాటు పలువురు సినీనటులు హాజరయ్యారు.