టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే బంద్‌కు సహకరించాలి

YSRCP

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షల పేరిట ప్రజల సోమ్ము వృథా చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపోరాట దీక్షల కోసం దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తమ పార్టీ సమావేశాలకు వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ ఎప్పటికి మిత్రులేనన్న విషయం పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టమయిందన్నారు.

ఉపాధి, డ్వాక్రా, అంగన్‌వాడీ మహిళలను మభ్యపెట్టి దీక్షలకు తరలించి చంద్రబాబు డ్రామాలు ఆడుతారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీడీపీ విఫలమైనందుకు నిరసనగా రేపటి(మంగళవారం) బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన బంద్‌కు సహకరించాలన్నారు. టీడీపీ ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.