టీడీపీ కి గుడ్‌బై చెప్పి ఫ్యాన్ గూటికి చేరనున్న‌: మాజీ ఎమ్మెల్యే కన్నబాబు

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేత వైసీపీలో చేరనున్నారు. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తెలుగు దేశానికి గుడ్‌బై చెప్పి ఫ్యాన్ గూటికి చేరనున్నారు. మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు కన్నబాబు వెల్లడించారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఎలమంచిలిలో టీడీపీ గెలుపునకు కీలక పాత్ర పోషించానని చెప్పారు. కానీ టీడీపీ మాత్రం తనను చిన్నచూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. అలాగే నారా లోకేశ్ కూడా హామీ ఇచ్చి దగా చేశారన్నారు. అందుకోసమే వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇక భగవంతుడు చెప్పినా విననని తెగేసి చెప్పారు. ఎలమంచిలి, పాయకరావుపేటలో వైసీపీ గెలుపే లక్ష్యంగా తాను పని చేస్తానని కన్నబాబు వెల్లడించారు.

కన్నబాబు అలకకు కారణమిదేనా?
కాంగ్రెస్ హయాంలో కన్నబాబు ఎలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మంత్రి కొణతాల హయాంలో చక్రం తిప్పారు. ఆ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా కాకపోయినా, ఎమ్మెల్సీగా అయినా చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశించారు. కానీ ఫలం దక్కలేదు. దీంతో ఆయన అన్నీ దిగమింగి అవకాశం కోసం
ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఆయన ప్రాతినిథ్యం వహించిన ఎలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈసారి కూడా అవకావం రావడం కష్టమని భావించి ఆయన కూడా ప్రత్యామ్నాయం చూసుకున్నారు. పార్టీ మారాలని దాదాపు నిర్ణయించుకున్నారు. దీనిపై అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం కన్నబాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.