టెన్త్‌ విద్యార్థుల ఫలితాలు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్లీనరీ కారణంగా తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడనున్నాయి. వాస్తవానికి శుక్రవారం ఉదయం టెన్త్‌ ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. దానిని రాత్రి 7 గంటలకు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయాన్నే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరగనుండటంతో ఉదయం నుంచి సీఎం, మంత్రులు సహా అధికార పార్టీ గణమంతా రోజంతా అక్కడే బిజీగా ఉండనున్నారు. దీంతో ఫలితాలను వెల్లడించేందుకు ఉదయం అనువైన సమయం కాదని వాయిదా వేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఫలితాలను విడు దల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంది.

సచివాలయంలోని డీ బ్లాక్‌లో టెన్త్‌ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,76,388 మంది కాగా, బాలికలు 2,62,479 మంది ఉన్నారు.

సాయంత్రం ఫలితాలతో విద్యార్థులకు ఇక్కట్లు!
పదో తరగతి ఫలితాలను రాత్రి విడుదల చేయనుండటంతో విద్యార్థులు ఫలితాలను చూసుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్నెట్‌ కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఉన్నందున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచనల మేరకు అధికారులు ఫలితాల వెల్లడి సమయాన్ని మార్పు చేశారు.